ఈ ఏడాది ఆగస్టు నెలలో రిలయన్స్ జియో కొత్తగా 32.4 లక్షల మంది సబ్స్క్రయిబర్లను సంపాదించుకోవడంతో మొత్తం సబ్స్క్రయిబర్ల సంఖ్య 44.57 కోట్లకు పెరిగింది. ఇదే నెలలో భారతి ఎయిర్టెల్ 12.17 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లను చేర్చుకున్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా వెల్లడించింది. మరో వైపు కష్టాలలో కొనసాగుతున్న వోడాఫోన్ ఐడియా (వీ) మాత్రం ఆగస్టు నెలలో 49,782 మంది సబ్స్క్రయిబర్లను పోగొట్టుకుంది. భారతీ ఎయిర్ టెల్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య ఆగస్టు నెలలో 37.64 కోట్లకు పెరిగిందని, వోడాఫోన్ ఐడియా సబ్స్క్రయిబర్లు 22.82 కోట్లకు తగ్గిపోయారని కూడా ట్రాయ్ డేటా తెలిపింది.
ట్రాయ్ ఈ డేటాను ప్రతి నెలా ప్రకటిస్తోంది. జులై నెలతో పోలిస్తే ఆగస్టులో కొత్త కస్టమర్ల సంఖ్య రిలయన్స్ జియోకి తగ్గింది. జులై నెలలో ఈ కంపెనీ 39 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లను తన ఖాతాలో వేసుకుంది. ఆగస్టు నెలలో 1.26 కోట్ల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం రిక్వెస్టులు పెట్టుకున్నారని, దీంతో ఎంఎన్‌పీ కోసం వచ్చిన మొత్తం రిక్వెస్టులు 87.7 కోట్లకు (ఎంఎన్‌పీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా) చేరాయని ట్రాయ్ డేటా వివరించింది. బ్రాడ్‌బ్యాండ్‌లో దేశంలోని టాప్ అయిదు సర్వీస్ ప్రొవైడర్లకూ కలిపి 98.35 శాతం మార్కెట్వాటా ఉన్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వీ, బీఎస్ఎన్ఎల్ మొదటి 4 ప్లేస్‌లలో ఉన్నాయని పేర్కొంది. ఆగస్టు చివరి నాటికి దేశంలోని వైర్లెస్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 114.8 కోట్లకు చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –