Politics

ఆడపిల్లకు తులం బంగారం – కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో

ఆడపిల్లకు తులం బంగారం – కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో

నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల పుట్టగానే ‘బంగారు తల్లి’ పథకం కింద ఆర్థిక సాయం, యువతుల పెళ్లికి రూ.లక్షతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల(తులం) బంగారం, వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటు, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ‘సీఎం ప్రజాదర్బార్‌’, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి జనాకర్షక హామీలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో సిద్ధమైంది. దీన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల సభలోనూ పాల్గొంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మ్యానిఫెస్టోలోని ముఖ్యమైన హామీల వివరాలు..

 • తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల నెలవారీ పింఛన్‌. ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. 250 చదరపు గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు.
 • రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంటరుణ మాఫీ. ఏటా రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంటరుణం.
 • వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటు. ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం.
  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ.
 • అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ. వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.
 • విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15% వరకు నిధుల కేటాయింపు. బాసర ట్రిపుల్‌ఐటీ తరహాలో మరో 4 ఏర్పాటు.
 • మోకాలు శస్త్రచికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తింపు.
 • ధరణి స్థానంలో ‘భూమాత’ పేరుతో కొత్త పోర్టల్‌. ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం. గతంలో పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి హక్కుల కల్పన.
 • ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు పెండింగ్‌లో ఉన్న డీఏల తక్షణం చెల్లింపు.
 • ఉద్యోగులకు పాత పింఛన్‌ విధానం అమలు. కొత్త పీఆర్‌సీ ఏర్పాటు. ఆరు నెలల్లోపు సిఫారసుల అమలు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లింపు.
 • ప్రతి ఆటో డ్రైవర్‌ ఖాతాలో ఏడాదికి రూ.12,000 జమ.
 • మద్యం బెల్టు షాపుల రద్దు.
 • ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు.
 • కులగణన చేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన. బీసీలు, మైనారిటీలకు విడివిడిగా ప్రత్యేక ఉప ప్రణాళికలు. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు.
 • యాదవులు, కురుమలకు గొర్రెల పెంపకం కోసం నేరుగా రూ.2 లక్షల అందజేత.
 • స్వయంసహాయక బృందాలకు రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు.
 • 18 సంవత్సరాలు నిండి.. చదువుకుంటున్న యువతులందరికీ ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.
 • హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యకు పరిష్కారం. మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం.
 • రేషన్‌ కార్డులపై సన్నబియ్యం పంపిణీ.
 • గల్ఫ్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు. గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం.
 • దివ్యాంగుల నెలవారీ పింఛన్‌ రూ.5,016కు పెంపు. 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు రూ.3,016 పెన్షన్‌.
 • ప్రతి జిల్లాలో గురుకుల క్రీడా పాఠశాల.
 • ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్‌ వైభవం ఆధునికీకరణ.
 • మెట్రో రైళ్ల ఛార్జీల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50 శాతం రాయితీ.
 • హైదరాబాద్‌లో నాలాల ఆధునికీకరణ.
 • రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి, ఇంటి పన్ను బకాయిలపై జరిమానాలు రద్దు.
 • నగరపాలికలు, మున్సిపాలిటీల్లో ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్‌ స్కూళ్లు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z