Food

శీతాకాలంలో వచ్చే సీతాఫలం యొక్క ఔషధ గుణాలు

శీతాకాలంలో వచ్చే సీతాఫలం యొక్క ఔషధ గుణాలు

ఆపిల్‌ రంగూ మామిడి రుచీ లేని కొండ పండు అది. కానీ తినేకొద్దీ తినాలనిపించే తియ్యదనం దాని సొంతం. అదే సీతాఫలం… పోషక గుణాలు మెండుగా ఉన్న ఔషధ ఫలం. అందుకే మధురమైన ఆ మృదుఫలం ఏటికేడాది సరికొత్త రుచిని అద్దుకుంటూ అతి తక్కువ గింజలతో భారీసైజులో ఎన్నో రకాల్లో పండుతూ ధరలో విదేశీ పండ్లతో పోటీ పడుతోంది..!

మామిడిపండ్లకోసం వేసవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కొందరయితే, సీతాఫలాల్ని తీసుకొచ్చే శీతకాలం కోసం వేయికళ్లతో ఎదురుచూసేవాళ్లు మరికొందరు. కొండల్లో కోనల్లో డొంకల్లో ఈ చెట్లు సులభంగా పెరుగుతాయి కాబట్టి వాటిని కోసుకొచ్చి అమ్మడంతో చౌకగా దొరికేవి ఒకప్పుడు. క్రమేణా దేశవిదేశీ రకాలను సంకరీకరించి సృష్టించిన హైబ్రిడ్‌ వెరైటీల్ని తోటల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు. దాంతో పేదోడి ఆపిల్‌గా పిలిచే సీతాఫలం ధర కాస్తా కొండెక్కి కూర్చుంది. కిలో వంద నుంచి ఐదు వందల రూపాయల వరకూ పలుకుతోంది. అయినప్పటికీ సీజన్‌లో మాత్రమే దొరికే ఆ మధురఫలాన్ని తినకుండా ఉండలేరు మరి. రుచి సంగతలా ఉంచితే సీతాఫలంలో ఔషధగుణాలూ ఎక్కువే. అందుకే ఇరవయ్యొకటో శతాబ్దపు సూపర్‌ ఫ్రూట్‌గానూ పేరొందింది.

రకాలెన్నో…విత్తనాన్నీ పండే నేలనూ బట్టి సీతాఫలం రుచి మారుతుంటుంది. వాషింగ్టన్‌, బ్రిటిష్‌ గయానా, లేట్‌గోల్డ్‌… వంటి విదేశీ రకాలతోపాటు షహరాన్‌పుర్‌, కాకర్లపహాడ్‌… వంటి మేలుజాతి వంగడాలనూ పండిస్తున్నారు. ఇటీవల వృద్ధి చేసిన అర్క సహాన్‌, అర్క నీలాంచల్‌ విక్రమ్‌, ఎన్‌ఎమ్‌కె-01 గోల్డెన్‌ రకాలు అధిక గుజ్జును కలిగి ఉండి, చాలా రోజులు నిల్వ ఉంటున్నాయి. దిగుబడి కూడా బాగుండటంతో వీటినీమధ్య ఎక్కువగా సాగుచేస్తున్నారు. పైగా వీటిల్లో గింజలు ఏడెనిమిదికి మించవు. అదే సాధారణ రకాల్లో నలభైకి పైగానే ఉంటాయి. కొందరు గింజలు అస్సలు లేకుండానూ పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్క సహాన్‌ రకం పండినా కూడా తొక్క గట్టిగా ఉండటంతో త్వరగా పాడవదు. రవాణాకీ అనుకూలంగా ఉండటంతోపాటు నీటి వసతి లేని వేడి ప్రాంతాల్లోనూ పండటంతో రాజస్థాన్‌లోనూ దీన్ని పండిస్తున్నారు. మయన్మార్‌ రెడ్‌, ఆస్ట్రేలియా పింక్‌బ్లష్‌, క్యాంపాంగ్‌ మోవ్‌ పర్పుల్‌ రకాలు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే కొత్త రకాలెన్ని వచ్చినప్పటికీ మహబూబ్‌నగర్‌కు చెందిన బాలానగర్‌, రాజమండ్రి దీవాన్‌చెరువు, అనంతపురం దుర్గం
సీతాఫలాల రుచికి మరేవీ సాటి రావు అనేవాళ్లే ఎక్కువ.

ఈ పండుకి… ఆ పేరెలా?
సీతాఫలం… అన్న పేరు వినగానే ఇదేదో మన దగ్గరే పుట్టినది అనుకుంటాం. పైగా సీతమ్మకి ఇష్టమని కథ చెప్పినా చెబుతాం. కానీ 16వ శతాబ్దం వరకూ మనకిది తెలీదు. ఇదే కాదు, రామ, లక్ష్మణ, హనుమాన్‌ ఫలాలుగా పిలిచే అనోనా జాతులన్నీ కూడా దక్షిణ, మధ్య అమెరికాకు చెందినవే. పోర్చుగీసు వాళ్ల ద్వారానే మనదేశానికి వచ్చాయి. అప్పటినుంచీ ఈ పండ్లనీ చెట్ల ఆకుల్నీ బెరడునీ ఆయుర్వేదంలోనూ వాడుతున్నారు. ఈ పేర్లు ఎవరు పెట్టారో తెలియదు కానీ ఆ పేర్లతోనే అవి విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందడం విశేషం.

లేత ఎరుపు రంగులో నున్నగా గుండె ఆకారంలో ఉండే రామా ఫలాన్నే కస్టర్డ్‌ ఆపిల్‌, బుల్లక్‌ హార్ట్‌ అనీ పిలుస్తారు. తియ్యని వాసనతో ఉండే ఈ పండులో సహజంగానే గింజలు తక్కువ. ఆకుపచ్చరంగులో ముళ్లతో ఉండే లక్ష్మణఫలం పండాక పైనాపిల్‌, స్ట్రాబెర్రీ, అరటి పండ్లు కలగలిసిన రుచితో ఉంటుంది. నున్నగా ఆకుపచ్చ రంగులో ఉండే మరో రకాన్ని హనుమ ఫలం అంటారు.

సీతాఫలంతో పోలిస్తే మిగిలినవాటిల్లో ఔషధ గుణాలు ఎక్కువ. అయినప్పటికీ తియ్యని సీతాఫలం అంటేనే మనకిష్టం. కాకపోతే న్యూట్రాసూటికల్స్‌లో రామ, లక్ష్మణ ఫలాల్ని వాడటంతో వాటినీ ఎక్కువగా పండిస్తున్నారు. సీతాఫలాన్ని ఆ పండ్లతో సంకరీకరంచి కొత్త జాతుల్నీ పుట్టిస్తున్నారు. రామాఫలం నరాల సమస్యలున్నవాళ్లకి మంచిదట.

లక్ష్మణ ఫలంలో అల్సర్లూ రక్త సమస్యలూ బీపీ క్యాన్సర్లను నిరోధించే గుణాలు ఎక్కువట. పొట్టలోని నులిపురుగులకీ ఈ పండు మంచిమందు. దీని ఆకుల్ని క్యాన్సర్‌కు మందుగా విక్రయిస్తున్నారు. అందుకే అమెజాన్‌ ప్రజలు దీన్ని మిరకిల్‌ ట్రీ అంటారు. వయసుతోపాటు వచ్చే వ్యాధులూ దీర్ఘకాలిక వ్యాధుల్ని హనుమాన్‌ ఫలం నివారిస్తుందట.

ఇక, పసుపురంగు గుజ్జుతో ఉండే క్రాసిఫ్లోరా, పనసతొనల్ని మరిపించే గోల్డెన్‌, తెలుపూ-గులాబీ రంగుల గుజ్జుతో ఉండే కాక్సీనియా, నారింజ రంగులోని స్పైనసెన్స్‌ నలుపూ పసుపూ తొక్కతో ఉండే రొలినీయా లేదా బిరిబా… ఇలా మరెన్నో అనోనా జాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోషకాలున్న ఔషధ ఫలాలే. పైగా మృదువైన గుజ్జుతో నోరూరిస్తుంటాయి. దాంతో వీటిని తాజాగా తినడంతోపాటు ఎండబెట్టి ఫ్లేక్స్‌, పొడి, స్క్వాష్‌ రూపంలో కూడా నిల్వచేస్తున్నారు. మిల్క్‌షేక్‌లూ ఐస్‌క్రీములూ డెజర్ట్‌లూ స్వీట్లూ కుకీల తయారీలోనూ వాడుతున్నారు. ఈమధ్య బ్రాండెడ్‌ కంపెనీలన్నీ సీతాఫల ఐస్‌క్రీమ్‌ని ప్రత్యేకంగా తయారుచేస్తున్నాయి. దాంతో ఇదో తాజా ఫుడ్‌ ట్రెండ్‌గా మారిపోయింది.

ఔషధ గుణాలు!…తియ్యని సీతాఫలాన్ని మధుమేహులు తినకూడదు అనుకుంటారు. కానీ దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 54 మాత్రమే. ఇందులోని పీచు గ్లూకోజ్‌ను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ వాళ్లు మితంగా తినొచ్చనీ, ఇది ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, గుండెకి మేలు చేస్తుందనీ చెబుతున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులోని పీచు మలబద్ధకాన్నీ ఇతరత్రా జీర్ణసమస్యల్నీ దూరం చేస్తుంది. నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది.

పీసీఓడీ ఉన్నవారిలో హార్మోన్ల అసమతౌల్యత కారణంగా మూడ్‌స్వింగ్స్‌ ఉంటుంటాయి. అలాగే కొవిడ్‌ తరవాత చాలామందిలో మానసిక ఒత్తిడి, హృద్రోగసమస్యలు పెరిగాయి. అలాంటివాళ్లకి సీతాఫలంలో ఎక్కువగా ఉండే బి6 విటమిన్‌ ఆనందాన్ని కలిగించే సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఒత్తిడికి కారణమయ్యే రసాయనాల్ని అరికట్టడం ద్వారా చలికాలంలో వచ్చే మానసిక, అనారోగ్య సమస్యల్నీ నివారిస్తుంది.

ఈ పండు తింటే గర్భిణులకి వికారం తగ్గుతుందనీ పుట్టబోయే పిల్లల మెదడు పనితీరు బాగుంటుందనీ చెబుతున్నారు. ఇందులోని కాపర్‌ నెలలు నిండకుండా ప్రసవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పైగా కాపర్‌ జుట్టు తెల్లబడకుండా చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

సీతాఫలంలోని బులటాసిన్‌, అసిమిసిన్‌ అనే ఫ్లేవనాయిడ్లకు క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయనీ, ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్‌లు మూత్రపిండ వ్యాధుల్ని తగ్గిస్తాయని పరిశోధనలూ చెబుతున్నాయి. మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండే సీతాఫలం ఎముక పుష్టినీ పెంచుతుంది. కాబట్టి ఆర్ధ్రయిటిస్‌ వాళ్లకీ ఈ పండు మేలే. చర్మ సమస్యలకు ఇది మంచి మందు. పచ్చికాయల్ని దంచి ఉప్పువేసి పుండ్లూ గడ్డలమీద పెట్టినా తగ్గుతాయి అంటారు. అందుకే మరి… మధురమైన సీతాఫలం పోషకాలు సమృద్ధిగా ఉన్న ఔషధ ఫలం కూడా!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z