Fashion

మిస్ యూనివర్స్‌గా షెన్సీస్ పలసీయోస్

మిస్ యూనివర్స్‌గా షెన్సీస్ పలసీయోస్

ప్రతిష్ఠాత్మక ‘మిస్‌ యూనివర్స్‌’ (Miss Universe) కిరీటం ఈ ఏడాది నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ పలాసియోస్ (Sheynnis Palacios) ‘మిస్‌ యూనివర్స్‌ -2023’ టైటిల్‌ దక్కించుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel).. ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌గా కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు. దీంతో, వీరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న తొలి నికరాగ్వా భామ షెన్నిస్ పలాసియోస్‌ కావడం విశేషం. చివరి రౌండ్‌లో ఆమె చెప్పిన సమాధానానికి అందరూ ఫిదా అయ్యారు. ‘ఒక ఏడాది పాటు వేరే మహిళగా జీవించాలనుకుంటే ఎవరిలా ఉండాలనుకుంటారు? ఎందుకు?’ అని ప్రశ్నించగా.. ‘‘స్త్రీ హక్కుల కోసం ఎంతగానో పోరాటం చేసిన సామాజిక వేత్త మేరీ వాట్సన్ బ్రాడ్‌ను ఎంచుకుంటా. ఎందుకంటే, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి.. ఎంతోమంది మహిళలకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీలు అనుకుంటే ఎక్కడైనా వర్క్‌ చేయగలరు. కాబట్టి, తాము కోరుకున్న రంగంలో మహిళలు పని చేసేందుకు సరైన పరిస్థితులు తీసుకురావడానికి నేను కృషి చేయాలనుకుంటున్నా’’ అని ఆమె బదులిచ్చారు.

శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా.. టాప్ 20లో నిలిచారు. విశ్వసుందరి పోటీల్లో తొలిసారి పాకిస్థాన్‌ తరఫున ఎరికా రాబిన్ పోటీపడ్డారు.

👉 – Please join our whatsapp channel her

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z