Devotional

శ్రీ కృష్ణుడు గోవుల కాపరి ఎందుకు అయ్యాడు?

శ్రీ కృష్ణుడు గోవుల కాపరి ఎందుకు అయ్యాడు?

అందరినీ రక్షించేవాడైన ఆ పరమాత్మ గోవులనే ఎందుకు కాయాలన్న ప్రశ్నతలెత్తుతుంది. మహావిష్ణు అవతారుడైన శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవికి నివాస స్థానమైన గోవులను సాకడంలో ఆమెతో సాహచర్యంలోని అనుభూతిని పొందుతున్నాడు. ఇది పౌరాణిక కోణం.

ఇక ఆధ్యాత్మిక కోణం నుంచి పరిశీలిస్తే- గోవులో సకల దేవతలు, గ్రహాలు, పంచభూతాలు,అన్ని ఔషధ గుణాలు, సద్గుణాలు లాంటివెన్నో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని నియంత్రించి, సరైన పంథాలో ఉపయోగపడేలా చూడటం వాటిని మానవాళి సక్రమంగా ఉపయోగించుకునేలా చూసే నేర్పు, ఒడుపు తెలిసినవాడు శ్రీమన్నారాయణుడే. వాటిని లోకులందరికీ ఉపయోగపడేలా చూడటం, అవి పరిధి దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అందుకోసం ఆప్యాయత, అనురాగాలతో సాకడం వంటి మెలకువలు తెలిసిన వాడాయన.

‘గోసేవ చెయ్యడం వల్ల అనేక శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి. సామాజిక, ఆర్థిక, లౌకిక, ఆధ్యాత్మిక లాభాలున్నాయి’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది లౌకిక కోణం. ‘గోవును సేవించినవారి వంశం వృద్ధి చెందుతుంది’ అని పురాణ కథనం. రఘువంశ కావ్యంలో దిలీప మహారాజు కామధేనువు సంతానమైన నందినీ ధేనువుకు సేవ చేశాడని, దాని అనుగ్రహం (వరం) వల్ల సంతానవంతుడయ్యే వరం పొందాడని తెలిపే కథ ఉంది. గోవు శరీరం నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం (పేడ)- వీటిని పంచగవ్యాలంటారు. ఈ అయిదూ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇవన్నీ లోకులు గ్రహించి గోసేవ చేయాలని, ఫలితంగా ఆరోగ్యాన్ని పొందుతారని  వారికి స్ఫూర్తి కలిగేలా కృష్ణుడు గోసేవ చేశాడు.

కృష్ణుడు వేణువును ఊది గోవులకు ఆనందం కలిగించేవాడు. అప్పుడవి తమంత తాముగా పాలను ధారగా కురిపించేవి. తన ఉనికి వాటికి తెలపాలన్నా, వాటిని దగ్గరకు పిలవాలన్నా, పలకరించాలన్నా వేణునాదంతోనే. అవన్నీ చెలిమితో మాలిమై మెలగేవి. ఆరోగ్యంతో అలరారేవి. ఫలితంగా సుభిక్షమైన పాడిని అందించేవి.

అనుభూతులు, అనుబంధాలు, ఆత్మీయతలు లాంటివన్నీ అన్ని ప్రాణులకూ సమానమేనని- ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదనే సందేశం ఇవ్వడమే శ్రీకృష్ణుడి పశుపాలనలోని ఆంతర్యం..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z