Politics

యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తాం!

యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తాం!

రాబందుల లెక్క రైతులను పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రశ్నించారు. 55 ఏళ్లలో సాధ్యం కానిది ఈ 9 ఏళ్లలో భారాస చేసి చూపించిందన్నారు. ఆలేరు భారాస అభ్యర్థి గొంగిడి సునీతకు మద్దతుగా యాదగిరిగుట్టలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం (Telangana Elections) నిర్వహించారు. డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. (Telangana Elections)

‘‘యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమే. కొండపైకి ఆటోలు వెళ్లేలా డ్రైవర్లకు డిసెంబర్ 3 తర్వాత శుభవార్త చెబుతాం. కాంగ్రెస్ హయాంలో ప్రజలు కరెంట్‌ కష్టాలతో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్‌ కాదు.. ఉత్తుత్తి కరెంట్‌. వరిధాన్యం పండించడంలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్ వన్‌గా ఉంది. తాగు, సాగునీటి కష్టాలు లేవు.

డిసెంబర్ 3 తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు వస్తాయి. అలాగే 4 కొత్త పథకాలు ప్రకటిస్తాం. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం ‘సౌభాగ్యలక్ష్మీ’, ఆసరా పెన్షన్‌లను రూ.5 వేలు, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.400కే ఇస్తాం. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. భూమిలేని పేదలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా కల్పిస్తాం. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడంతో పాటు సమ్మక్క సారక్క పేర్లపై మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తాం. గొంగిడి సునీతను మళ్లీ గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురాలను మండలాలుగా ప్రకటిస్తాం. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తాం. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తాం. దాతరుపల్లి వద్ద టూరిజం పార్కుతోపాటు పారిశ్రామిక కారిడార్ తీసుకువస్తాం’’ అని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z