DailyDose

ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ!

ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ!

ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో కీలకమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. గెలుపే లక్ష్యంగా ఇన్నాళ్లు ప్రచారం, సభలు, సమావేశాలతో సర్వశక్తులు ఒడ్డిన వారు ఇప్పుడు ఓటర్లకు నేరుగా నగదు పంపకానికి సన్నద్ధమయ్యారు. గతేడాదితో పోలిస్తే రెండో శ్రేణి కార్యకర్తలకు అభ్యర్థులు డబ్బుల పంపిణీ, ముఖ్య నాయకుల కొనుగోళ్లు తగ్గాయి. కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే చాలా పల్లెల్లోనూ గతంతో పోలిస్తే ఎన్నికల గొడవలు సైతం తగ్గడం గమనార్హం. అన్ని పార్టీల అభ్యర్థులు వారి పార్టీల రెండో శ్రేణి నాయకులకు డబ్బులు ఇచ్చే బదులు ఆ నగదును నేరుగా ఓటర్లకే ఇచ్చి గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓటుకు విలువ పెరగగా…నగదును పంపిణీ చేసే ఓటర్ల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 500 నుంచి రూ. వేయి వరకు పంపిణీ చేశారు. అనంతరం ఈ ఐదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికలు అనంతర పరిణామాలతో ఓటుకు హీనపక్షం ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ. వేయి పంపిణీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఓటుకు నగదు పంపిణీ చేసే సంస్కృతి లేని సీనియర్‌ నాయకులు సైతం ఈ దఫా ఓటరుకు నగదును పంపిణీ చేస్తున్నారు.

పంపిణీకి ప్రత్యేక పర్యవేక్షకులు… నగదు పంపిణీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటూ తమ బంధువులనూ ప్రతి గ్రామానికి ఓ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నారు. సదరు గ్రామంలో పార్టీ నాయకుడు సూచించిన వారితో పాటూ తటస్థులకు, ఎదుటి పార్టీలో ఉన్నా డబ్బులిస్తే తమకు ఓటు వేస్తారనుకున్న వారికి నగదును ముట్టజెబుతున్నారు. అలా సుమారు 1200 ఓట్లున్న ఓ గ్రామంలో సుమారు 850 నుంచి 900 ఓట్లకు ఓటుకు రూ. వేయి చొప్పున ఇస్తున్నారు. దీంతో మరో ప్రధాన పార్టీ ఎక్కువిస్తే పోలింగ్‌కు ముందు రోజు మరోసారి నగదును ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. నాయకుడు ఇచ్చిన డబ్బులు మధ్యలో ఎవరూ మింగకుండా ప్రతి పైసా ఓటరుకు చేరేలా అభ్యర్థికి చెందిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. మరో పార్టీలో ఈ వ్యవస్థ పకడ్బందీగా పనిచేయకపోవడంతో కొన్ని చోట్ల రెండో శ్రేణీ నాయకుల వద్దే నిల్వలు ఉండిపోతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కొత్తగా చట్టసభల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఓ మండలంలోని అన్ని గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ పూర్తి చేశారు. దుటి పార్టీ ఇచ్చేదాన్ని బట్టి మరో దఫా పంపిణీ చేసేందుకు నగదును సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలోనే మరో ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.2500 చొప్పున నేటి రాత్రి నుంచి పంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

సూర్యాపేట జిల్లాలోని ఓ సీనియర్‌ నాయకుడు సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా నియోజకవర్గంలోని సుమారు లక్షన్నర మందికి ఓటుకు రూ.వేయి చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. ఎదుటి పార్టీ అభ్యర్థి సైతం పంపిణీ మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు సుమారు లక్షన్నర ఓట్లకు ఓటుకు రూ.వేయి చొప్పున పంపిణీ పూర్తి చేశారు.

నల్గొండ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో గత అనుభవాల దృష్ట్యా ఓ ప్రధాన పార్టీ అభ్యర్థివే ముందుగా నగదు వస్తుందని ఊహించిన ఓటర్లు…ఇప్పటికీ ఆ అభ్యర్థి నుంచి ఆశించినంత స్పందన లేకపోవడంతో ఆ పార్టీ రెండో శ్రేణి కార్యకర్తలే అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయని తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z