Politics

ఎస్‌ఎంఎస్‌లపై ఈసి నిషేధం

ఎస్‌ఎంఎస్‌లపై ఈసి నిషేధం

శాసనసభ ఎన్నికల సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిశబ్ద వ్యవధిలో(సైలెన్స్‌ పీరియడ్‌లో) అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ప్రసారం నిషేధమని, వీటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌ల ప్రసారాలను ఎన్నికల కమిషన్‌ నిలిపివేయాలని ఆదేశించిందన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా ఎస్‌ఎంఎస్‌లు పంపరాదన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి భారత శిక్షాస్మృతి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

పోలింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష

పోలింగ్‌ కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఇతర ముఖ్య ఎన్నికల అధికారులతో కలిసి వికాస్‌రాజ్‌ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి, చొప్పదండి, మానకొండూర్‌, కరీంనగర్‌ రిటర్నింగ్‌ అధికారులు ప్రఫుల్‌దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌, కె.మహేశ్వర్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z