NRI-NRT

అమెరికాలో కొత్త వలసదారులకు పలకరింపే కరువైంది!

అమెరికాలో కొత్త వలసదారులకు పలకరింపే కరువైంది!

మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్‌ దేశాల నుంచి అమెరికాకు(America) వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. జో బైడెన్‌ ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల కొత్తగా వచ్చిన వలసదారులకు వేగంగా పని అనుమతులు లభిస్తుంటే.. దశాబ్దాల నుంచి అమెరికాలో స్థిరపడిన వలసదారులు ఇప్పటికీ పర్మిట్లు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. ఇది వలసదారుల్లో విభేదాలు, ఉద్రిక్తతలను పెంచుతోంది. అమెరికాలో దగ్గరి బంధువులు ఉన్నారనీ, వారు తమను ఆదుకుంటారనే ఆశతో వచ్చిన కొత్త వలసదారులకు పలకరింపే కరవు అవుతోంది. ఆర్థిక ప్రాయోజకుడి సాయంతో ఆన్‌లైన్‌లో తాత్కాలిక పని అనుమతులు పొందిన 2.7 లక్షల మంది క్యూబా, వెనెజువెలా, హైతీ, నికరాగువా దేశాల నుంచి అక్టోబరులో అమెరికా చేరుకున్నారు. సీబీపీ వన్‌ అనే మొబైల్‌ యాప్‌ సాయంతో మరో 3.24 లక్షల మంది మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించనున్నారు.

బైడెన్‌ సర్కారు సెప్టెంబరులో పని అర్హత పొందినవారికి సమాచారం అందిస్తూ 14 లక్షల ఈమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సందేశాలు పంపింది. వీరికన్నా ఎన్నో దశాబ్దాల ముందు అమెరికాకు వలస వచ్చి, పనిచేస్తూ, పన్నులు కడుతున్న వలసదారులకు ఇంతవరకు పని పర్మిట్లు లభించకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. కొత్త వలసదారులకు ఆహారం, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించడానికి 140 కోట్ల డాలర్లు మంజూరు చేయాలని బైడెన్‌ సర్కారు పార్లమెంటు(కాంగ్రెస్‌)ను కోరింది. వలస ప్రవాహం వల్ల తమ బడ్జెట్లు, అత్యవసర సేవలు దెబ్బతింటున్నాయని, ఫెడరల్‌ ప్రభుత్వం తమకు 500 కోట్ల డాలర్లు మంజూరు చేయాలంటూ న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్‌, షికాగో, డెన్వర్‌, హ్యూస్టన్‌ నగరాల గవర్నర్లు దేశాధ్యక్షుడు బైడెన్‌కు గత నెలలో లేఖలు రాశారు. కొత్తగా వచ్చినవారితో పాటు దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్న పాతవారికీ సాధికార పని పర్మిట్లు జారీ చేయాలనే డిమాండ్‌తో ఇటీవల వేలమంది రాజధాని వాషింగ్టన్‌లో ప్రదర్శన జరిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z