Politics

ఇది మన నేల.. మన పోరాటం!

ఇది మన నేల.. మన పోరాటం!

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన(Janasena)కు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందని, యువతే పెద్ద బలమని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘మన పార్టీకి యువత బలం చూసి భాజపా పెద్దలే ఆశ్చర్యపోయారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు దిల్లీలోనూ గుర్తింపు వచ్చింది. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత వెంట వస్తున్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశాం. ఖమ్మం, మధిర, కూకట్‌పల్లి, దుబ్బాక ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారు’’

‘‘వైకాపాకు భావజాలం లేదు. ఎందుకోసం పనిచేస్తున్నారో వారికే తెలియదు. అన్న ముఖ్యమంత్రి కావాలి.. అందుకోసం పనిచేస్తున్నాం అని చెబుతారు. నేను ఏం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తా. సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంది. హైదరాబాద్‌లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం చాలా బాధ కలిగించింది. నా సినిమాలు ఆపేసినా, నేను బసచేసిన హోటల్‌కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా.. మన పోరాటం మనమే చేసుకున్నాం తప్ప ఏనాడూ జాతీయ స్థాయి నాయకుల వద్దకు వెళ్లి మీ సహాయం కావాలని చేయిచాచి అడగలేదు. ఎందుకంటే ఇది మన నేల.. మన పోరాటం. కుదిరితే మనం వారికి బలం అవ్వాలి. కానీ, మనం బలం చూపించకపోతే వాళ్లు గుర్తింపు ఇవ్వరు. పోరాటం చేసే వాళ్లనే వారు గుర్తిస్తారు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది’’ అని పార్టీ శ్రేణులకు పవన్‌ దిశానిర్దేశం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z