DailyDose

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి-నేర వార్తలు

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి-నేర వార్తలు

* రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి

కిరాణ సామాన్లు తీసుకుంటున్న రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి చేయడం పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేతలు ఆందోళన నిర్వహించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గవినోళ్ల వెంకట్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు శనివారం రాత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ రోడ్డుపై ధర్నా చేశారు.వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస కాలనీకి చెందిన గవినోళ్ల వెంకట్‌రెడ్డి శనివారం సాయంత్రం 5:40గంటల ప్రాంతంలో ఎస్‌వీ మార్ట్‌ దగ్గర కిరాణా సామాన్లు తీసుకుంటున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్‌ కొంతమందితో అక్కడికి వచ్చి కాంగ్రెస్‌కు ప్రచారం చేశావని తనపై దాడి చేస్తూ సూపర్‌మార్కెట్‌లో నుంచి బయటకు తెచ్చారని వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్‌ వెల్లడించారు.దాడిఘటనపై కాంగ్రెస్‌ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇటూ జడ్చర్ల వైపు అటూ బస్టాండ్‌ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అయ్యింది.ఈ సమయంలో ఒకరిద్దరూ రోగులు ఆస్పత్రికి వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేస్తున్న వారితో జిల్లా అదనపు ఎస్పీ రాములు చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా వెంకట్‌రెడ్డి ఇంటికి ఇద్దరూ కానిస్టేబుల్స్‌ను రక్షణగా ఇచ్చారు.

* మణిపుర్‌కు చెందిన ఓ కుటుంబంపై అమానుష దాడి

దేశ రాజధాని దిల్లీలో కొందరు దుండగులు మణిపుర్‌కు చెందిన ఓ కుటుంబంపై అమానుష దాడికి పాల్పడ్డారు. వాయవ్య దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న మణిపుర్‌ ప్రాంత వ్యక్తి స్నేహితుణ్ని భోజనానికి పిలిచాడు. రాత్రివేళ ఆలస్యం కావడంతో మిత్రుణ్ని ఇంటి వద్ద దిగబెట్టేందుకు తన భార్య, చెల్లితో సహా వెళ్లాడు. చీకట్లో ఈ ముగ్గురూ నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. తన ఫోను డెడ్‌ అయ్యిందని.. క్యాబ్‌ బుక్‌ చేసుకునేందుకు సాయం చేయమని ఓ వ్యక్తి కోరాడు. మణిపుర్‌ వ్యక్తి అందుకు సరేనంటూ ఫోను ఇవ్వబోగా.. ఎదురుగా ఉన్న అతడి భార్య, చెల్లిని ఆగంతుకులు అకారణంగా దుర్భాషలాడారు. ఇంతలో ఆ దుండగులకు తోడుగా మరికొందరు వచ్చారు. ఈ మూక మణిపుర్‌ కుటుంబంపై దాడికి దిగి మహిళలనే కనికరం కూడా చూపకుండా కిందపడేసి చావబాదారు. చుట్టుపక్కల ఉన్నవారు మిద్దెలపై నిలబడి చోద్యం చూశారే కానీ.. కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* బీర్కూర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో గల భజన్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లాభ్యమైనట్లు బీర్కూర్ ఎస్ఐ జి. నర్సింలు తెలిపారు. మృతదేహాన్ని చెరువులొ నుండి బయటకు తీస్తున్నామని, మృతురాలు ఎవరన్నది తెలియాల్సి ఉన్నదని అయన తెలియజేశారు.

* భర్త వేధింపులతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

మాకవరపాలెం మండలం కె.వెంకటాపురానికి చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి సిహెచ్‌. హేమ అరుంధతి (36) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్‌ ఎస్సై ధనుంజయనాయుడు వివరాల ప్రకారం.. నర్సీపట్నం ఎస్‌బీఐ(బజార్‌)లో పనిచేస్తున్న ఆమె భర్త వేధింపులతో మనస్తాపానికి గురైంది. శుక్రవారం సాయంత్రం పెదబొడ్డేపల్లి సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ వెనుక జీడితోటల్లోకి స్కూటీపై వెళ్లింది.అక్కడ స్కూటీ పార్కు చేసి, తన శవాన్ని చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటూ తెల్లకాగితంపై ఫోన్‌ నంబరు రాసింది. తన దగ్గర చున్నీతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మొదటి భర్త చనిపోవడంతో రాజమహేంద్రవరానికి చెందిన సహాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి వేధింపులు భరించలేక గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. మృతురాలికి మూడేళ్ల బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

* బొంరాస్ పేట్ మండలంలోని రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బొంరాస్ పేట్ మండలంలోని బొట్లవాణి తండా,హైదరాబాద్,బీజాపూర్ 163 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం,దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ యాదవ్ (35) పరిగి వైపు వెళ్తుండగా,బొట్లవాణి ఆశ్రమ బాలికల పాఠశాల దగ్గర బాలికను (వైశాలి 11ను) ఢీకొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కోడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,అప్పటికే కృష్ణ యాదవ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణ యాదవ్ హోంగార్డుగా హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బాలిక ఎడమ కాలుకు గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z