DailyDose

ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు

విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కారు బడులకు విముక్తి కల్పించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 6,490 స్కూళ్లల్లో సోలార్‌ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకు రూ.289.25 కోట్ల నాబార్డు నిధులను ఖర్చుచేయనున్నది. స్కూళ్లలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతలను టీఎస్‌రెడ్‌కోకు అప్పగించింది. ఈ సంస్థ టెండర్లను పూర్తిచేశాక ఏజెన్సీలను ఎంపికచేసి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతలను అప్పగిస్తుంది. విద్యార్థుల సంఖ్య, పాఠశాల అవసరాలను బట్టి 2 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌లను నెలకొల్పుతారు. ఒక్కో కిలోవాట్‌కు రూ.1 లక్ష చొప్పున ఖర్చుచేస్తారు. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలతో పాటు తెలంగాణ మాడల్‌ స్కూల్స్‌, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)ల్లోను కొత్తగా సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ బడుల్లో 5 కిలోవాట్లు, మాడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో 10 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను నెలకొల్పుతారు. కేజీబీవీలు, మాడల్‌స్కూల్స్‌లో హాస్టల్స్‌ను కూడా నిర్వహిస్తుండటం వల్ల విద్యుత్తు వినియోగం అధికమవుతుండటంతో ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచారు.

తప్పనున్న బిల్లుల భారం
ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో మొత్తంగా 3,072 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను అమర్చారు. ఇందుకు రూ.32.03 కోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆ ప్లాంట్లు విజయవంతంగా నడుస్తుండటంతో చాలా స్కూళ్లల్లో బిల్లుల భారం 50% మేరకు తగ్గింది. ఇదేవిధంగా హైస్కూళ్లు, కేజీబీవీలు, మాడల్‌ స్కూళ్లల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో విద్యుత్తు ఉపకరణాలను అమర్చారు. ప్రతి తరగతి గదికి నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు బిగించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కంప్యూటర్‌ ల్యాబ్‌లను నెలకొల్పారు. డిజిటల్‌ విద్య అమలులో భాగంగా ఇటీవలే డిజిటల్‌ ఇంటరాక్టివ్‌ ప్యానళ్లను సైతం ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్తు వినియోగం అధికమై బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిల్లల భారం నుంచి ప్రభుత్వ బడులకు విముక్తి కల్పించేందుకు సౌర విద్యుత్తును ఆశ్రయిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z