DailyDose

కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు-తాజా వార్తలు

కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు-తాజా వార్తలు

* కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. తుంటి గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాగా, కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6 నుండి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించిన  ప్ర‌కాశ్ రాజ్

య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పరామ‌ర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి.. కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కవితను సైతం ప్రకాష్ రాజ్ పరామర్శించారు.

*  విశాఖలో వైసీపీకి బిగ్ షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీకి చెందిన మరో కీలక నేత రాజీనామా చేశారు. గాజువాక వైసీపీ ఇన్‌చార్జి తిప్పల దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఒకేరోజు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయడం రాజకీయంగా ప్రకంపనటు సృష్టిస్తోంది. ఇకపోతే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం హాట్ సీట్. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గాజువాక నియోజకవర్గం నుంచి తిప్పల నాగిరెడ్డి గెలుపొంది జెయింట్ కిల్లర్‌గా మారారు. తిప్పల నాగిరెడ్డి గెలుపొందడంలో ఆయన తనయుడు, ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జి దేవన్ రెడ్డియే. అలాంటి తిప్పల దేవన్ రెడ్డి అకస్మాత్తుగా వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి దేవన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి ఉంటారని ప్రచారం ఉంది. అయితే కొన్ని రోజులుగా ఆయన పార్టీలో సైలెంట్‌గా ఉంటున్నట్లు సమాచారం. అయితే అకస్మాత్తుగా సోమవారం పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దేవన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కూడా ఉంది.

*  డియర్‌ సీఎం సార్‌

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ (Nandigam Suresh) అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశారని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇసుక రీచ్ కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మబలికి గుంటూరుకు చెందిన ముజిబుర్ రెహ్మాన్‌ కుటుంబం నుంచి రేపల్లె సన్నీ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని గత రెండేళ్లుగా అడుగుతున్నా..పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని రెహ్మాన్‌ మీడియా ఎదుట వాపోయారు. ఇదే విషయమై ఎంపీ నందిగం సురేశ్‌ను కూడా రెండుమూడు సార్లు కలిశామన్నారు. అయితే ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని.. ఇంకోసారి వస్తే జైళ్లో పెట్టిస్తానని బెదిరించినట్లు రెహ్మాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన వ్యక్తి కావటంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చామని రెహ్మాన్‌ తల్లి నజమున్నీసా వాపోయారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బ్యానర్‌ ప్రదర్శించారు.

*  విజయసాయిరెడ్డి కనుసన్నుల్లోనే మైన్స్ కుంభకోణం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ అంతా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కనుసన్నుల్లోనే జరుగుతుందన్నారు. ఈ అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆధారాలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓబుళాపురం మైనింగ్‌, మధు కోడా బొగ్గు మైనింగ్‌ అతిపెద్ద స్కామ్‌లని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న సిలికా, క్వాడ్జ్‌ స్కామ్‌లు ఏపీలో జరుగుతున్నాయని ఆరోపించారు.‘నెల్లూరు జిల్లా పోరాటాలకు పుట్టినిల్లు. ఇప్పుడు భారీ స్కామ్‌లకు పుట్టినిల్లుగా జగన్‌ మార్చేశారు’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ‘నెల్లూరు జిల్లాలో మైన్స్‌ కుంభకోణంపై ఎన్నో పోరాటాలు చేశాం..డీజీపీకి ఫిర్యాదు చేశాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో ఒక్క టన్నుకి రూ.100 ఉన్న పన్ను ఇప్పుడు వైసీపీ హయాంలో రూ.381కి పెంచేశారు అని మండిపడ్డారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మైన్స్‌ కుంభకోణం జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీకి జగన్‌కు ఆ కమీషన్‌ను చేరుస్తున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం రూ.4,455 కోట్ల విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైందని ఆరోపించారు. త్వరలో కేంద్ర విజిలెన్స్‌ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి ఊరు పక్కన దోపిడీ జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరి రేసులో నేనున్నా

గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే పదవికి, వైకాపా సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా చేయడంపై మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల (Kandru Kamala) స్పందించారు. రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత అంశం అన్నారు. ఆర్కే రాజీనామా పార్టీకి తీవ్ర నష్టమన్నారు.‘‘సీఎంకు ఆర్కే సన్నిహితుడు కాబట్టి.. ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. ఆర్కే గెలిచాక ఒక నెల మాత్రమే మాతో సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత కార్యక్రమాలకు మమ్మల్ని దూరం పెట్టారు. పార్టీ పరువు తీయకూడదనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాను. ఆర్కే గెలుపు విషయంలో నా కృషి చాలా ఉంది. నా వల్లే ఆయనకు మెజార్టీ వచ్చింది. నేను కూడా మంగళగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నా. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు సీటు కావాలంటే కుదరదు. అధిష్ఠానం నిర్ణయం మేరకు నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా’’ అని కాండ్రు కమల తెలిపారు.

గాజువాక వైసీపీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాథ్‌

గాజువాక వైసీపీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాథ్‌ పేరును ఖరారు చేస్తూ.. వైసీపీ కేంద్రం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఇంచార్జ్‌ తిప్పల దేవన్‌రెడ్డి రాజీనామాతో.. గుడివాడ అమర్నాథ్‌ను అధిష్టానం నియమించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z