Politics

కేసీఆర్‌కు పరామర్శించిన రేవంత్‌

కేసీఆర్‌కు పరామర్శించిన రేవంత్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగి సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రేవంత్‌ పరామర్శించారు. రేవంత్‌ రాగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దగ్గరుండి కేసీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. కేసీఆర్‌కు నమస్కరించిన రేవంత్‌.. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకొన్నారు. అందుతున్న వైద్యసేవలు, కేసీఆర్‌ ఆరోగ్యస్థితిగతులపై డాక్టర్‌ ఎంవీ రావు బృందాన్ని ఆరా తీశారు. రేవంత్‌ వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ రాగా, పరామర్శ సమయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు అక్కడ ఉన్నారు.

కేసీఆర్‌ సలహాలు అవసరం: సీఎం
ప్రభుత్వానికి, ప్రజలకు కేసీఆర్‌ సలహాలు, సూచనలు అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రమాదవశాత్తు కింద పడ్డారని, శస్త్రచికిత్స అనంతరం వారి ఆరోగ్యం కుదుటపడుతున్నదని చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ఇప్పటికే సీఎస్‌ సహా సంబంధితశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మంచి ప్రభుత్వ పా లన అందించేందుకు కేసీఆర్‌ సూచనలు అవసరమని, ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరమున్నదన్నారు. త్వర గా కోలుకొని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరినట్టు రేవంత్‌ చెప్పారు.

పరామర్శించిన మంత్రులు, నేతలు
కేసీఆర్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ వీహెచ్‌ హన్మంతరావు, మాజీ మంత్రి కోదండరెడ్డి, ఎంపీ టి రాములు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బీఆర్‌ఎస్‌ నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, దాసోజు శ్రవణ్‌ పరామర్శించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌కుమార్‌, కవితను కలిసి.. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు.