Politics

తిరువూరులో ‘రా.. కదలి రా’ సభలో పాల్గొన్న బొండా ఉమా

తిరువూరులో ‘రా.. కదలి రా’ సభలో పాల్గొన్న బొండా ఉమా

ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ ఊరూరా తిరిగిన జగన్‌.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెదేపా (TDP) మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తెదేపా నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.

‘‘జగన్‌ పాలనలో అంతులేని అవినీతి జరిగింది. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల జీవితాలు తలకిందులయ్యాయి. పన్నుల పేరిట ప్రజలపై భారం వేశారు. ఆ ఆదాయమంతా ఏమైంది? రూ.12లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. ఆ డబ్బును ఏం చేశారో చెప్పడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెదేపా హయాంలో ఇసుకను ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు వైకాపా నేతలు దోచుకుంటున్నారు. గతంలో మద్యం పాలసీ పారదర్శకంగా ఉండేది. ఇప్పుడు ప్రతి డిస్టిలరీని వైకాపా నేతలు నడుపుతున్నారు. మద్యం ద్వారానే రూ.60వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. జగన్‌ పాలనలో చితికిపోయిన ప్రజలకు ధైర్యం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఆలోచించారు. ఈ సంవత్సరం చాలా కీలకమైంది. తెదేపా-జనసేన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకురావాలి’’ అని బొండా ఉమా కోరారు.

ప్రజల రక్తాన్ని జగన్‌ జలగలా పీల్చుతున్నారు: పోతిన మహేశ్‌
జనసేన నేత పోతిన మహేశ్‌ మాట్లాడుతూ.. వైకాపా ఓటమి ఖరారైందని చెప్పారు. వివిధ రకాల పన్నులతో ప్రజల రక్తాన్ని జగన్‌ జలగలా పీల్చుతున్నారని ఆరోపించారు. త్వరలోనే లోటస్‌పాండ్‌ను ఆయన శాశ్వత నివాసంగా మార్చుకుని అక్కడికి వెళ్లనున్నారన్నారు. ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z