NRI-NRT

తెలంగాణ బీసీ స్కాలర్‌షిప్‌లో మార్పులు

తెలంగాణ బీసీ స్కాలర్‌షిప్‌లో మార్పులు

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ పథకం మార్గదర్శకాలను మార్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. విదేశాల్లోని అన్ని యూనివర్సిటీలకు కాకుండా కొన్నింటికే ఈ పథకాన్ని వర్తింపచేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పథకం కింద విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నది. ఫలానా వర్సిటీ అన్న తేడా లేకుండా ఎక్కడ సీటు వచ్చినా ఇప్పటివరకు ఈ పథకం వర్తిస్తున్నది. ఇకపై ఎంపికచేసిన టాప్‌ 50 వర్సిటీల్లో సీట్లు వచ్చినవారికి మాత్రమే ఈ పథకం కింద ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్స్‌ ఇవ్వాలని అధికారులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించినట్టు సమాచారం.

ఇప్పటికి 2700 మందికి లబ్ధి
పేదింటి బీసీ బిడ్డలు విదేశాల్లో మాస్టర్స్‌, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల అభ్యాసానికి కేసీఆర్‌ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా జనవరిలో (ఫాల్‌ సీజన్‌) 150 మంది, ఆగస్టులో (స్ప్రింగ్‌ సీజన్‌) 150 మందిని ఎంపికచేసి ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నది. వీసా, ప్రయాణ చార్జీలకు గరిష్ఠంగా రూ.50 వేలు అందజేస్తున్నది. ఈ పథకంలో 30 సీట్లను ఈబీసీలకు కేటాయించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపు 2700 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇటీవల బీసీ సంక్షేమశాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ప్రత్యేక సమీక్ష నిర్వహించి ఈ పథకం అమలుపై ఆరా తీశారు. అ పథకానికి స్పెషల్‌ కేసులు (పైరవీలు) ఎక్కువగా నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పథకం అమలుకు నిర్దేశించిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలలోపు, అకడమిక్‌ మార్కులకు 60 శాతం, జీమ్యాట్‌/జీఆర్‌ఈ 20 శాతం, టోఫెల్‌, ఐలెట్స్‌, పీటీఈ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి, ఆ మెరిట్‌ ఆధారంగా అర్హుల జాబితా సిద్ధంచేస్తున్నారు. అనంతరం సంబంధిత విభాగం అధికారులతోపాటు, ఉన్నత, సాంకేతిక విద్య, జేఎన్టీయూకు చెందిన సభ్యులతో ఏర్పాటైన స్టేట్‌ లెవల్‌ స్క్రీనింగ్‌ కమిటీకి ఆ జాబితాను పంపి అర్హులను ఎంపిక చేస్తున్నారు.

టాప్‌ 50 యూనివర్సిటీలకే పరిమితం
ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజీలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ, టెక్సాస్‌ యూనివర్సిటీ, మిచిగాన్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, మిన్నెసోటా యూనివర్సిటీ, కెనడాలోని కాంకోర్టీయ తదితర యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. ఇకపై అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందినవారికి కాకుండా, విదేశాల్లోని టాప్‌ 50 యూనివర్సిటీల్లో చేరినవారికే బీసీ ఓవర్సీస్‌ పథకాన్ని వర్తింపచేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్‌ పథకానికి సంబంధించి ఫాల్‌ సీజన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగుతున్నది. ఫాల్‌సీజన్‌కు ఈ ఏడాది 2,665 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2023 మంది బీసీ కులాలకు చెందినవారు కాగా, 642 మంది ఈబీసీ విద్యార్థులున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభించారు. జనవరి 23 వరకు ఇది కొనసాగనున్నది. అయితే పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేస్తే ఆ కొత్త నిబంధనలను ఈ ఫాల్‌ సీజన్‌ నుంచే అమలు చేస్తారా? వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z