వ్యక్తిగత రుణాలు ఖరీదెక్కనున్నాయా? అంటే రుణదాతల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయిప్పుడు. ఆర్బీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో ఈ ఏడాది వడ్డీరేట్లు 1.5 శాతం వరకు పెరిగే వీలుందని చెప్తున్నారు. అన్‌సెక్యూర్డ్ లోన్ల విభాగంలో ఉన్న వ్యక్తిగత రుణాల వంటివి గడిచిన కొన్నేండ్లుగా విపరీతంగా పెరుగుతుండటాన్ని ఆర్బీఐ గమనించింది. ఈ క్రమంలోనే రిస్క్ వెయిటేజీని 100 నుంచి 125 శాతానికి పెంచింది. వచ్చే నెల 29కల్లా కొత్త నిబంధనల్ని ఆర్బీఐ పర్యవేక్షణలో ఉన్న అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు తప్పక పాటించాల్సిందే. ఇప్పటికే ఆయా బ్యాంకులు ఈ దిశగా అడుగులు వేయగా, మరికొన్ని సిద్ధమవుతున్నాయి.
ఏం జరుగుతుంది?
ఆర్బీఐ కొత్త రూల్స్‌తో వ్యక్తిగత రుణాలను తీసుకున్నవారు మరింతగా చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ పర్సనల్ లోన్ల కోసం తమ మూలధన నిల్వల్ని పెంచుకోవాల్సి వస్తున్నది మరి. నిపుణుల వివరాల ప్రకారం ప్రస్తుతం బ్యాంకులిచ్చే ప్రతీ రూ.100 పర్సనల్ లోన్‌కు తమ డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణార్థం మరో రూ.100ను బ్యాంకులు రిస్క్-వెయిటెడ్ అసెట్స్‌గా పెట్టాల్సి వస్తున్నది. అయితే ఆర్బీఐ సవరించిన రూల్స్‌తో ఇక రూ.125ను కేటాయించాలి. ఇక క్యాపిటల్ అడికసీ రేషియో (సీఏఆర్) కింద ఈ రూ.125లో 9 శాతం (రూ.11.25) పక్కన పెట్టాలి. ఇంతకుముందు ఇది రూ.9గానే ఉండేది. అంటే ప్రతీ రూ.100 పర్సనల్ లోన్‌కు అదనంగా రూ.2.25 క్యాపిటల్‌ను బ్యాంకులు సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఈ భారం అంతిమంగా రుణగ్రహీతలపైనే పడుతుందని, వడ్డీరేట్ల పెంపు ద్వారానే అది ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెరగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే క్రెడిట్ కార్డుదారులకూ ఈ కొత్త రూల్స్ సెగ తగలనున్నది. బ్యాంకులు రిస్క్ వెయిటేజీని 150 శాతానికి పెంచాలి. ఇప్పుడు 125 శాతమే. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇప్పుడున్నదానికి 25 శాతం పెంచాలి. దీంతో క్రెడిట్ కార్డు వినియోగదారులూ అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. ఈ రూల్స్‌తో మార్కెట్ల నుంచి రుణదాతలు ఎక్కువ నిధులను సమీకరించాల్సి వస్తున్నదని, దాంతో సదరు మొత్తాలకు చెల్లించే సొమ్మును రుణగ్రహీతల నుంచే సహజంగా వడ్డీరేట్ల పెంపుతో వసూలు చేస్తారని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. కనుక అధిక వడ్డీరేట్ల భారం తప్పదనే అంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –