Sports

విజయం బాటలో సుమిత్

విజయం బాటలో సుమిత్

భారత యువ టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ సంచలన విజయం ఖాతాలో వేసుకున్నాడు. మూడున్నర దశాబ్దాలుగా భారత ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను మెల్‌బోర్న్‌లో నాగల్‌ నిజం చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సీడెడ్‌ ప్లేయర్‌ను మట్టికరిపించి తొలిసారి రెండోరౌండ్‌కు ప్రవేశించాడు. రెండున్నర గంటలకు పైగా సాగిన సుదీర్ఘ పోరులో నాగల్‌ వరుస సెట్లలో విజృంభించగా.. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ అలవోకగా ముందంజ వేసింది.

మెల్‌బోర్న్‌: సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత ఆటగాడు దుమ్మురేపాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 26 ఏండ్ల సుమిత్‌ నాగల్‌.. అద్వితీయ ప్రదర్శనతో సీడెడ్‌ ఆటగాడిపై విజయం సాధించాడు. క్వాలిఫయింగ్‌ టోర్నీలో మూడు విజయాలు సాధించి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించిన నాగల్‌.. మంగళవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 6-4, 6-2, 7-6 (7/5)తో ప్రపంచ 27వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు.

నాగల్‌ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ విజయం కాగా.. తొలిసారి అతడు ఆస్ట్రేలియా ఓపెన్‌ రెండో రౌండ్‌కు చేరాడు. ఐటా టోర్నీలతో రాటుదేలిన నాగల్‌.. మంగళవారం 31వ సీడ్‌ బబ్లిక్‌పై 2 గంటల 38 నిమిషాల పాటు పోరాడి విజయం సాధించాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 137వ స్థానంలో ఉన్న నాగల్‌.. ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్‌ పాయింట్లతో పాటు.. భారీ నగదు బహుమతి ఖాతాలో వేసుకోనున్నాడు. 2019 యూఎస్‌ ఓపెన్‌ ద్వారా గ్రాండ్‌స్లామ్‌ ఎంట్రీ ఇచ్చిన నాగల్‌.. టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌పై ఒక సెట్‌ గెలిచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత అడపా దడపా విజయాలు సాధిస్తూ వచ్చిన నాగల్‌.. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. టాప్‌-100లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తూ మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. సుదీర్ఘంగా సాగిన పోరులో ఒక్క ఏస్‌కే పరిమితమైన నాగల్‌.. 6 బ్రేక్‌ పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. 13 ఏస్‌లు సంధించిన అలెగ్జాండర్‌ 3 బ్రేక్‌ పాయింట్లు సాధించాడు.

29 విన్నర్లు బాదిన నాగల్‌.. 26 అనవసర తప్పిదాలకు పాల్పడితే.. 41 విన్నర్లు కొట్టిన అలెగ్జాండర్‌ 44 తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. పదునైన సర్వీస్‌లతో పాటు.. నెట్‌ గేమ్‌తో ప్రత్యర్థికి ముప్పుతిప్పలు పెట్టిన నాగల్‌.. తొలి రెండు సెట్లను అలవోకగా కైవసం చేసుకున్నాడు. మూడో సెట్‌లో అలెగ్జాండర్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. వెనక్కి తగ్గకుండా పోరాడి చివరకు మ్యాచ్‌ను ముగించాడు. రెండో రౌండ్‌లో గురువారం జెన్‌చెంగ్‌ షాంగ్‌ (చైనా)తో నాగల్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

స్వియాటెక్‌ సులువుగా..
ప్రపంచ నంబర్‌ ఇగా స్వియాటెక్‌.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అలవోక విజయంతో ముందంజ వేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మంగళవారం స్వియాటెక్‌ (పోలాండ్‌) 7-6 (7/2), 6-2తో మాజీ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)పై విజయం సాధించింది. మూడేండ్ల క్రితం మెల్‌బోర్న్‌లో విజేతగా నిలిచిన కెనిన్‌ను స్వియాటెక్‌ వరుస సెట్లలో మట్టికరిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో పెగులా 6-2, 6-4తో మారినోపై.. రడుకాను 6-3, 6-2తో రోజర్స్‌పై.. రిబాకినా 7-6, (8/6), 6-4తో ప్లిస్కోవాపై.. ఓస్టపెంకా 7-6 (7/5), 6-1తో బిరెల్‌పై విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండోసీడ్‌ అల్కరాజ్‌ 7-6 (7/5), 6-1, 6-2తో గాస్కెట్‌పై.. ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ 4-6, 6-3, 7-6 (7/3), 6-3తో కొఫెర్‌పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు గర్వించదగ్గ విజయం. నా వరకు శక్తివంచన లేకుండా కష్టపడ్డా. అందుకు తగ్గ ఫలితం వచ్చిందనుకుంటున్నా.స్కోరు గురించి పట్టించుకోకుండా.. ఆటపైనే దృష్టిపెట్టా. నా సహజసిద్ధమైన ఆట ఆడా. తదుపరి మ్యాచ్‌ గురించి ఎక్కువ ఆందోళన చెందడం లేదు.
– నాగల్‌

1 గ్రాండ్‌స్లామ్‌లో ఓ సీడెడ్‌ ప్లేయర్‌పై భారత ఆటగాడు గెలవడం 35 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 1989 ఆస్ట్రేలియా ఓపెన్‌లో రమేశ్‌ కృష్ణన్‌.. అప్పటి డిఫెండింగ్‌ చాంపియన్‌ మాట్స్‌ విలాండర్‌ (స్వీడన్‌)పై విజయం సాధించాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z