Business

క్యూ3 ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జోరు

క్యూ3 ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జోరు

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్‌ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్‌ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది.

ఎన్‌పీఏలు ఇలా…

బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్‌పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z