DailyDose

కవిత‌కు షాకిచ్చిన సైబర్ క్రిమినల్స్-నేర వార్తలు

కవిత‌కు షాకిచ్చిన సైబర్ క్రిమినల్స్-నేర వార్తలు

* కవిత‌కు షాకిచ్చిన సైబర్ క్రిమినల్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఖతాలు హ్యాక్‌కు గురయ్యాయి. ఈ మేరకు ఆమె బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్‌కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

* పోలీసుల కండ్లుగప్పి నిందితుడు పరార్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ పోలీసుల(Vemulawada police station) కండ్లుగప్పి ఓ నిందితుడు(Accused) ఠాణా నుంచి తప్పించుకోవడం పోలీసుశాఖలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లికి చెందిన ఒకరిపై దాడి చేసిన సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. నిందితులను రిమాండ్‌ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అందులో ఒకరు గంభీరావుపేట ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని మంగళవారం రాత్రి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రిమాండ్‌ చేయాల్సి ఉండగా ఉదయం పూట సదరు నిందితుడు చాకచక్యంగా స్టేషన్‌ నుంచి పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, విధుల నిర్లక్ష్యంపై మాత్రం జిల్లా పోలీస్‌ బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

* వరుసగా దూసుకెళ్లిన కార్లు

గత కొద్ది రోజులుగా ఉత్తర భారతాన్ని పొగమంచు కప్పేస్తోంది. దాంతో ఎదురుగా వస్తున్న వ్యక్తులు, వాహనాలు కనిపించని పరిస్థితి. ఇదే దిల్లీ(Delhi)లో ఘోర ఘటనకు దారితీసింది. రోడ్డు ప్రమాదానికి (Road accident) గురైన వ్యక్తిని గుర్తించలేని వాహనదారులు వేగంగా వెళ్లడంతో ఆ మనిషి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. దాంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. కనీసం మహిళా, పురుషుడా అనేది కూడా తెలియట్లేదని పోలీసులు చెబుతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..దేశ రాజధానిలో ఎన్‌హెచ్‌9 సమీపంలో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రహదారులను శుభ్రం చేస్తుండగా.. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరభాగాలు కన్పించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు. ఆ తర్వాత వరుసగా వాహనాలు వెళ్లడంతో ఈ ఘోరం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. అయితే పొగమంచు వల్ల మొదట ఢీకొన్న వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు.

* భర్తను హతమార్చిన భార్య

మద్యం తాగి నిత్యం వేధిస్తున్న భర్తను కుమారుడితో కలిసి కట్టుకున్న భర్త హతమార్చిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం కొండనాగులలో సోమవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎండి మహమూద్‌ (45) తాపీమేసీ్త్రగా, భార్య నిరంజన్‌బీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా కుమార్తె వివాహం జరిగింది.మహమూద్‌ నిత్యం మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఘర్షణకు దిగి భార్యపై గొడ్డలితో దాడి చేయగా.. ఆమె ఎదురుతిరిగి కుమారుడు పాషాతో కలిసి అదే గొడ్డలి తీసుకొని కొట్టగా తల, గొంతుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఖైరున్‌బీ ఫిర్యాదు మేరకు నిరంజన్‌బీ, కుమారుడు పాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

విద్యుత్‌ షాక్‌(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం.. రావికంపాడు గ్రామానికి చెందిన రైతు కుక్కుల శ్రీనివాసరావు(50) కరెంటు మోటర్‌తో నీరు పెట్టేందుకు బుధవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు.ఈ క్రమంలో పొలంలోని విద్యుత్‌ స్తంభానికి గల సపోర్టింగ్‌ వైరు తెగి ఉండడాన్ని గమనించాడు. దానిని పొలం గట్టుపై వేసేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించగా దానికి కరెంటు సరఫరా అవుతున్న క్రమంలో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మాచినేని రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

* కొల్లూరు చోరీ కేసులో పనిమనిషే అసలు దొంగ

కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రాబరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని చేసే వ్యక్తులే చోరీకి పాల్పడ్డట్లు గుర్తించిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కేజీ బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన సొత్తుతో తమ స్వగృహాలకు వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో పక్కా సమాచారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్.జి. సైబరాబాద్ కమిషనరేట్ కొల్లూరు పీఎస్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌ లో ఉన్న ముప్పా ఇంద్రప్రస్థాన్ విల్లాస్‌ లోని ముల్కల సుజాత ఇంట్లో పనిచేసేవాడు. ఇంటి యజమాని సుజాత పని మనిషి ప్రభాకర్ మాలిక్ ను ఇంట్లో ఉంచి వ్యక్తిగత పనిమీద ఢిల్లీ వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ప్రభాకర్ మాలిక్ తన స్నేహితులతో కలిసి సుజాత ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆమె తిరిగి ఇంటికి చేరుకొని దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.సుజాత ఇంట్లో పనిచేసే ఒరిస్సాకు చెందిన ప్రభాకర్ మాలిక్, తపన్ దాస్, సచీంద్ర దాస్, రతికంట దాస్ అనే నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. వీరిలో ప్రభాకర్ మాలిక్, సచిందా దాస్, రితికంఠాదాస్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు కాగా తపన్ దాస్ కడప జిల్లాకు చెందినవాడు. ఈ నెల 15వ తేదీన నిందితుడు ప్రభాకర్ మాలిక్ గోపన్‌పల్లి పరిధిలో ఉన్నాడని, మిగిలిన వారు తమ స్వగృహాలకు వెళ్లడానికి సిద్ధమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సుజాత ఇంట్లో లాకర్ ఓపెన్ చేసి బంగారం, వజ్రాభరణాలు, నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. బంగారం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు. వీరి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీసీపీ అభినందించారు.