Business

NPCIతో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్‌పే-వాణిజ్య వార్తలు

NPCIతో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్‌పే-వాణిజ్య వార్తలు

* NPCIతో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్‌పే

గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్‌ పే (Google Pay) నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)కు చెందిన ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ వెలుపలా యూపీఐ సేవల్ని అందించటంలో భాగంగా గూగుల్‌పే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇతర దేశాలకు వెళ్లే వారికి నగదు తీసుకెళ్లటం, ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఛార్జీల భారం తగ్గనుంది.ఇతర దేశాల్లోను సులువుగా యూపీఐ చెల్లింపులు జరపాలన్న ఉద్ధేశంతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గూగుల్‌ పే తెలిపింది. ఇందులో మూడు కీలకాంశాలు పేర్కొంది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారత్ వెలుపలా లావాదేవీలు నిర్వహించటం మొదటిది కాగా, ఇతర దేశాల్లో యూపీఐ వంటి డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడంలో సాయపడటం రెండోది. చివరగా వివిధ దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియ సులభతరం చేయడం ఈ ఒప్పందం ఉద్దేశం అని గూగుల్‌ పే ఓ ప్రకటనలో తెలిపింది.ఇకపై డిజిటల్‌ చెల్లింపులు చేయడానికి విదేశీ కరెన్సీ, ఫారెక్స్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, గూగుల్‌పే ద్వారా భారత్‌ వెలుపలా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఎన్‌పీసీఎల్‌ పేర్కొంది. ఈ అవగాహన ఒప్పందం యూపీఐ ఉనికిని బలోపేతం చేస్తుందని ఎన్‌పీసీఎల్‌ సీఈఓ రితేష్‌ శుక్లా పేర్కొన్నారు.

* పెరిగిన చికెన్ ధరలు

కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, నేడు చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ చికెన్ రూ. 319గా ఉంది. అలాగే బోన్ లెస్ చికెన్ రూ. 520గా, స్కిన్‌లెస్ రూ. 200గా ఉంది.

* శాంసంగ్‌కు షాకిచ్చిన యాపిల్

దక్షిణకొరియాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌కు (Samsung) యాపిల్ (Apple) షాకిచ్చింది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న ఆ కంపెనీని తొలిసారి వెనక్కి నెట్టింది. దాదాపు 12 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న శాంసంగ్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్లు సరఫరా చేసిన కంపెనీగా తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2023కు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (IDC)కు సంబంధించిన గణాంకాలు వెలువరించింది.ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ సరఫరా విషయంలో శాంసంగ్‌ 2010 నుంచి అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అలాంటిది తొలిసారి యాపిల్‌ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో మొత్తం 235 మిలియన్‌ యూనిట్లను యాపిల్ సరఫరా చేసినట్లు ఐడీసీ పేర్కొంది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఐదో వంతు ఫోన్లను యాపిల్‌ సరఫరా చేసినట్లు ఐడీసీ తెలిపింది. ఆ సమయంలో శాంసంగ్‌ 226.6 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా చేసినట్లు పేర్కొంది. 19.4 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. షావోమీ, ఒప్పో.. వంటి కంపెనీలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. కొత్త మోడళ్లను విడుదల చేసినప్పుడు పాత ఫోన్లపై ఆఫర్లు ప్రకటించడం, వడ్డీ లేని రుణాలు, ప్రీమియం డివైజులకు గిరాకీ పెరగడం వంటివి యాపిల్‌ సక్సెస్‌కు కారణాలుగా ఐడీసీ విశ్లేషించింది. యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో ప్రభుత్వ ఆంక్షలు, ఆ దేశ కంపెనీ అయిన హువావే నుంచి గట్టి పోటీని తట్టుకుని మరీ ఈ లక్ష్యం సాధించిందని ఐడీసీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నబిలా పోపాల్‌ తెలిపారు. మరోవైపు ఆండ్రాయిడ్‌ ఫోన్లు తయారుచేసే శాంసంగ్‌ కంపెనీ షావోమీ నుంచి పోటీ ఎదుర్కొంటోంది. 2023లో 1.2 బిలియన్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర విక్రయాలు తగ్గినట్లు ఐడీసీ తెలిపింది. ఆండ్రాయిడ్‌ సెగ్మెంట్‌లో పోటీ పెరగడం, ఫోల్డబుల్‌ ఫోన్లు, ఏఐపై కస్టమర్లు ఆసక్తి చూపుతుండడంతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఆసక్తిగా మారిందని పేర్కొంది.

* నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఒకే రోజు ఏకంగా 1600పాయింట్లు, నిఫ్టీ 460 పాయింట్లకుపైగా పతనమయ్యాయి. ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్‌ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. గ్లోబర్‌ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దాంతో పాటు సూచీలు గరిష్ఠానికి చేరుకున్న నేపథ్యంలో మదుపరులు లాభాలను ఆర్జించేందుకు ఆసక్తి చూపారు.దాంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 72,409.71 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు 1,628.01 పాయింట్లు పతనమై 71,500.76 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 473.35 పాయింట్లు కోల్పోయి 21,558.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడాదిన్నర తర్వాత 21,600 పాయింట్ల దిగువకు దిగజారడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌లో దాదాపు 998 షేర్లు పురోగమించగా.. 2,238 షేర్లు క్షీణించాయి. 50 షేర్లు మాత్రం మారలేదు.

* IANS న్యూస్‌ ఏజెన్సీలో వాటాను కొనుగోలు చేసిన అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ (Gautam adani) తన మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ (IANS) ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌.. తాజాగా దాన్ని మరింత పెంచుకుని మీడియా సంస్థపై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ ద్వారా ఇటీవల IANSలో 50.50శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇప్పుడు దాన్ని ఓటింగ్‌ హక్కులతో 76శాతం, ఓటింగ్‌ హక్కులు లేకుండా 99.26 శాతానికి పెంచుకున్నారు. ఇందుకు రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. జనవరి 16న జరిగిన న్యూస్‌ ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఈ వాటాల పెంపునకు ఆమోదం లభించింది. IANS ఇకపై ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ అనుబంధ సంస్థగా పనిచేస్తుందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఏఎన్‌ఎస్‌ ఆదాయం రూ.11.86 కోట్లుగా ఉంది. గతేడాది మార్చిలో బిజినెస్‌, ఫైనాన్షియల్‌ న్యూస్‌ అందించే క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా కొనుగోలుతో మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్డీటీవీలో (NDTV) 65 శాతం వాటాను చేజిక్కించుకున్నారు.