శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ (Ayalaan). దర్శకుడు ఆర్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. జనవరి 12న విడుదలైన ఈ తమిళ చిత్రం ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూలు (ayalaan collections) చేసింది. తెలుగులోనూ అదే రోజు విడుదల కావాల్సిఉండగా వాయిదా పడింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26న తెలుగు వెర్షన్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ‘‘ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో క్వాలిటీ విషయంలో మేం రాజీ పడలేదు. వీఎఫ్‌ఎక్స్ ప్రాధాన్య చిత్రమిది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు శ్రమించాం. తమిళ ప్రేక్షకుల ఆదరణ చూశాక మా కష్టాన్ని మర్చిపోయాం. తెలుగు ప్రేక్షకులూ ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని నిర్మాత కోటపాడి జె.రాజేశ్ పేర్కొన్నారు.
భూమి మీదకు వచ్చిన గ్రహాంతర వాసి.. హీరోతో పరిచయం ఎలా ఏర్పరచుకుంది? అసలు ఆ ఏలియన్ రావడానికి గల కారణమేంటి? వంటి అంశాలతో రూపొందిందీ సినిమా. విజువల్స్, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, యోగిబాబు, భానుప్రియ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సంక్రాంతికే తెలుగులోనూ సందడి చేయాల్సిన ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈనెల 25న ఇక్కడ విడుదల కానుంది. తమిళంలో ఈ నెల 12న విడుదలై, రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ (Captain Miller Collections) రాబట్టింది. ధనుష్ (Dhanush), ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన చిత్రమిది.
👉 – Please join our whatsapp channel here –