ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం(ఈ నెల 18) వరకూ గడువు ఉంది. అద్దంకి దయాకర్‌తో పాటు బల్మూరి వెంకట్‌కు అవకాశం ఇచ్చినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ, మహేశ్‌కుమార్ గౌడ్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉన్నందువల్ల రెండు స్థానాలనూ గెలిచేందుకు అవకాశముంది.
మెడిసిన్ చదివి రాజకీయాల్లోకి..
ఎంబీబీఎస్ చదివిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టి.. పార్టీలో గుర్తింపు పొందారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.
👉 – Please join our whatsapp channel here –