Business

టెక్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన గూగుల్-వాణిజ్య వార్తలు

టెక్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన గూగుల్-వాణిజ్య వార్తలు

* టెక్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన గూగుల్

టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి లేఆఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా ది వెర్జ్ నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, 2024 ఏడాదిలో గూగుల్‌ మరికొంత మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు అంతర్గత మెమోను జారీ చేసినట్లు సమాచారం. టెక్ కంపెనీ ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. పని, ఖర్చుల భారాన్ని తగ్గించడానికి ఆటోమేషన్‌ను అవలంబించాలని చూస్తుంది. దీని కారణంగానే కొత్త ఏడాదిలో మరికొంత మంది ఉద్యోగులను తొలగిస్తుంది.ఇంతకుముందు గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ టీమ్‌ల నుంచి వందల మందిని తొలగించింది. 2023లో ఒకేసారి తన ఉద్యోగుల్లో 12,000 మంది తొలగించింది. ఇటీవల కాలంలో కంపెనీ తన వ్యయ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలని చూస్తుంది. ఈ పెట్టుబడులను AI తో పాటు మరిన్ని విభాగాలకు కేటాయించాలని చూస్తోంది. దానిలో భాగంగా 2024 చివరి నాటికి కూడా లేఆఫ్‌ల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.

* అయోధ్యపై బ్యాంకుల ఫోకస్‌

రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో వాణిజ్య బ్యాంకులు తమ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కర్ణాటక బ్యాంకు వరకు దాదాపు అన్ని బ్యాంకులు తమ శాఖల్ని పెంచాలని నిర్ణయించాయి.దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీకి (HDFC) ఇప్పటికే అయోధ్యలో మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. మార్చి చివరికి మరో కొత్త బ్రాంచిని తెరవాలని చూస్తోంది. గత వారంలోనే కర్ణాటక బ్యాంక్‌ (Karnataka Bank) తన 915 శాఖను అయోధ్యలో ప్రారంభించింది. ఇక యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) మొబైల్ ఏటీఎంలను తీసుకురావడం ద్వారా ఏటీఎంల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపింది. వ్యాపార అవకాశాల దృష్ట్యా కొత్త బ్రాంచిని తెరిచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ తెలిపింది. 2019 నవంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. జనవరి 22న విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో వ్యాపార కార్యకలాపాలు జోరందుకున్నాయి. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. సరయూ నదీ తీరం పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది.

* ఆకాశ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు

భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ భారీగా విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో మరోసారి విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. దివంగత రాకేష్ ఝున్‌జున్‌వాలా కుటుంబానికి చెందిన కంపెనీ గతంలో 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 22 విమానాలను కంపెనీ డెలివరీ చేసింది. భారత విమానయాన రంగంలోకి ఆకాశ ఎయిర్‌లైన్స్‌ కొత్తగా ప్రవేశించిన విషయం తెలిసిందే.2022లో విమానయానరంగంలోకి ప్రవేశించిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటి వరకు 4శాతం మార్కెట్ వాటాను సాధించింది. అయితే, ఇండిగో 60శాతం మార్కెట్ వాటా కలిగి ఉండగా.. టాటాగ్రూప్ ఎయిర్‌లైన్స్‌కు 26శాతం వాటా ఉన్నది. మరో వైపు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అర్హతను ఎయిర్‌లైన్స్‌ సాధించింది. ఈ ఏడాది దోహా, రియాద్‌కి విమానాలను ప్రారంభించాలని యోచిస్తున్నది. భారతీయ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయంగా విమానాలు నడపాలంటే.. తన ఫ్లీట్లో కనీసం 20 విమానాలను ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. గత ఏడాది మరో ఎయిర్‌లైన్స్‌లో చేరేందుకు ఎలాంటి నోటీసు లేకుండా 40 మందికిపైగా పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కొన్నది.ఒక్కసారిగా పైలట్లు రాజీనామా చేయడంతో కొత్తగా ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సంక్షోభంలోకి వెళ్లింది. ఒక దశలో విమాన సంస్థ మూతపడొచ్చనే వార్తలు వచ్చాయి. పైలట్ల ఆకస్మిక రాజీనామా వల్ల సెప్టెంబర్‌లో ప్రతి రోజు దాదాపు 24 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితుల్లో దీంతో విమానయాన సంస్థ విమానాల సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చింది. దాంతో మార్కెట్ వాటా ఒకశాతం వరకు క్షీణించింది. ఆ తర్వాత కంపెనీ కొత్తగా పైలట్లను నియమించుకున్నది. సీఈవో వినయ్ కొత్తగా పైలట్లను నియమించుకున్నామని.. బలమైన బెంచ్ స్ట్రెంత్‌ని సృష్టించామని వెల్లడించారు.

* టీసీఎస్‌ కీలక నిర్ణయం

2023 ప్రారంభం నుంచి టెక్ ఉద్యోగులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది (2024) ప్రారంభంలో కూడా కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. టీసీఎస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఏకంగా ఐదు లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రారంభ దశలో ఉన్న Gen AIలో ఐదు లక్షలమందికి ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించింది. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధను ఉపయోగించుకోవాల్సి వస్తుందని, అప్పటికి అందులో శిక్షణ పొందిన ఉద్యోగుల అవసరం కంపెనీకి ఉంటుందని TCS ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.వర్క్‌ఫోర్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌లు అనే రెండు కీలక రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా AI భవిష్యత్తు కోసం TCS చురుకుగా సిద్ధమవుతోందని కంపెనీ AI.Cloud యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు.ఏఐ మీద శిక్షణ ఇవ్వడానికి కంపెనీ అత్యధునిక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ట్రైనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించనుంది, ఎప్పటికి పూర్తి చేయనుందనే విషయాలను వెల్లడించలేదు. కానీ గతంలో టీసీఎస్ కంపెనీ 150,000 మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి ఏడు నెలల సమయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులో ఐదు లక్షల మందికి ఎన్ని రోజుల్లో శిక్షణ ఇస్తుందనేది అంచనా వేసుకోవచ్చు.ఏఐ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు పోతాయని చాలా కంపెనీల సీఈఓలు గతంలో వెల్లడించారు, కానీ ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మానవ ప్రమేయం అవసరమని, తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కొందరు భావించారు. ప్రస్తుతం ఆ భావనే నిజమవుతోంది. పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ ఏఐపైన ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

* అడ్వెంచర్‌ కోరుకునేవారికి ‘NX500’

ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్స్ త్వరలో అడ్వెంచర్‌కు అనువుగా ఉండే ‘NX500’ వేరియంట్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ బైకు కావాలనుకున్న వినియోగదారులు అధికారిక డీలర్‌షిప్‌ల ద్వారా రూ.10,000 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. హోండా NX500 మోడల్ 471cc లిక్విడ్-కూల్డ్, సమాంతర-ట్విన్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 47.5 hp పవర్, 43 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇంకా నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. రైడర్‌లు బైక్ రైడింగ్ డేటా, పెట్రోల్ కెపాసిటీ తదితర వివరాలను చూడటానికి 5 అంగుళాల TFT స్క్రీన్‌‌ను అందించారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు USD ఫోర్క్, వెనుక మోనోషాక్‌ను ఉంది. ముందు LED హెడ్‌లైట్, ట్విన్ డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను అందించారు. బైకు బరువు 196 కిలోలు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z