DailyDose

పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో నిందితులకు షాక్-నేర వార్తలు

పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో నిందితులకు షాక్-నేర వార్తలు

* స్కూటీపై వచ్చి పోలీసుల కళ్లగప్పిన మహిళ

ఒక మహిళ పోలీసుల కళ్లగప్పింది. స్క్యూటీపై వచ్చిన ఆమె పోలీస్‌ కస్టడీలో ఉన్న భర్త తప్పించుకునేందుకు సహకరించింది. (Prisoner Great Escape by Wife) రిమాండ్‌ ఖైదీ పరార్‌ను ఆలస్యంగా గుర్తించిన పోలీసులు షాక్‌ అయ్యారు. సినిమాను తలపించేలా ఉన్న ఈ సంఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగింది. హోడల్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు అనిల్‌పై హర్యానాతోపాటు ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఒక కేసులో అతడ్ని అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ ఖైదీగా మధుర జైలులో ఉంచారు. కాగా, హత్యాయత్నం కేసు విచారణ కోసం రిమాండ్‌ ఖైదీ అనిల్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తమ వాహనంలో హర్యానాలోని కోర్టుకు తీసుకువచ్చారు. అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన పోలీస్ బృందం అతడి వెంట ఉంది. కోర్టు విచారణ అనంతరం హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధురకు పోలీస్‌ వాహనంలో బయలుదేరారు. డబ్చిక్‌లోని జాతీయ రహదారి 19పై వెళ్తుండగా అనిల్ భార్య స్కూటీపై వచ్చింది. పోలీసుల కళ్లగప్పిన ఆమె, వ్యాన్‌లో ఉన్న ఖైదీ భర్తను చాకచక్యంగా తప్పించింది.మరోవైపు రిమాండ్‌ ఖైదీ అనిల్‌ తప్పించుకుని పారిపోయిన విషయాన్ని పోలీసులు చాలా ఆలస్యంగా గుర్తించారు. స్క్యూటీపై వచ్చిన భార్య అతడికి సహకరించినట్లు తెలుసుకున్నారు. అయితే పోలీస్‌ వ్యాన్‌లో ఉన్న అనిల్‌ను ఆమె ఎలా తప్పించిందో అన్నది తెలియక తలలు పట్టుకున్నారు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసుల కళ్లగప్పి భర్త పారిపోయేందుకు సహకరించిన అనిల్‌ భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

* పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో నిందితులకు షాక్

పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో నిందితులకు చుక్కెదురైంది. పార్లమెంటు దాడి కేసులో నిందితురాలిగా ఉన్న నీలం ఆజాద్ బెయిల్ దరఖాస్తును పాటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. అదనపు సెషన్స్ జస్టిస్ హర్దీప్ కౌర్ ఆజాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి ఉపశమనం ఇవ్వడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.నీలం ఆజాద్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆమె భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించడంలో ఆమె ప్రమేయం ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై విచారణకు తన అవసరం లేదని, తనను కస్టడీలో ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదని బెయిల్ దరఖాస్తులో నీలం పేర్కొన్నారు. పోలీసులు ఈ దరఖాస్తును వ్యతిరేకిస్తూ.. విచారణ కొనసాగుతోందని, బెయిల్ మంజూరు చేస్తే అడ్డంకిగా మారుతుందని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతలో లోపం ఉదంతం వెలుగులోకి వచ్చింది.డిసెంబర్ 13, 2023న, సాగర్ శర్మ, మనోరంజన్ డి ప్రేక్షకుల గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోని ఎంపీలు కూర్చునే ప్రాంతానికి దూకారు. ఇద్దరూ పొగతో డబ్బాల ద్వారా తీసుకువచ్చిన పొగను పార్లమెంటులో వ్యాపించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన అమోల్ షిండే, నీలం ఆజాద్‌లు నియంతృత్వం పని చేయదంటూ నినాదాలు చేస్తూ డబ్బాల ద్వారా పొగలు వ్యాపించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, నలుగురు నిందితులతో పాటు లలిత్ ఝా, మహేష్ కుమావత్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి డిసెంబర్ 13 వార్షికోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.

* మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన

మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూడూరు గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని నిలదీసేందుకు వెళ్లిన తనపై కర్రలు,పైపులతో విచక్షణ రహితంగా నరేందర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధితురాలు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బుధవారం మేడ్చల్ పోలీసులు ఐపిసి సెక్షన్లు 324,342,506,509, కింద కేసు నమోదు చేశారు. పూడూరు గ్రామ వార్డు మెంబర్ భర్త నగేష్,నరేందర్ రెడ్డి బంధువులు మహిళను దారుణంగా కొట్టారు.న్యాయం చేయాల్సిన వార్డు మెంబర్ భర్త నగేష్ ఓ మహిళ అని గౌరవించకుండా మహిళను కిందేసి తొక్కడం పుడురు గ్రామంలో చర్చనీయంశంగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు మేడ్చల్ పోలీసులను సంప్రదించింది.ఒక మహిళ అని చూడకుండా నరేందర్ రెడ్డి ఇంట్లోని మహిళలు సైతం మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై కేసు నమోదు అయినా వారిని అరెస్టు చేయకపోవాడానికి కారణాలేంటని, బీఆర్‌ఎస్‌ పార్టీ వార్డు మెంబర్ భర్తను అరెస్టు చేయకుండా పోలీసు కాలయాపన ఎందుకు చేస్తున్నారని చర్చ సాగుతోంది.

* వాహనాలను ఢీ కొట్టిన కంటైనర్‌ లారీ

ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కంటైనర్ లారీ(Container lorry) రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి( Injured). ఈ విషాదకర సంఘటన హత్నూర్‌ మండలం సీతగొంది వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న బోర్‌వెల్ వాహనాన్ని వెనుక నుంచి కంటైనర్‌ లారీ ఢీ కొట్టింది.దీంతో బోర్‌వెల్‌ వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో కంటైనర్‌ లారీ ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* యూట్యూబర్‌పై కేసు నమోదు

జల్లికట్టులో పాల్గొనే ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించారు. (Jallikattu Bull Being Fed Live Rooster) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొంగల్‌ పండుగ నేపథ్యంలో తమిళనాడులో ప్రతిఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే ఎద్దులకు వాటి యజమానులు ప్రత్యేక ఆహారం తినిపిస్తారు.కాగా, చిన్నప్పంపట్టికి చెందిన కొందరు వ్యక్తులు జల్లికట్టులో పాల్గొనే ఎద్దుకు బలవంతంగా బతికున్న కోడిని తినిపించారు. తొలుత పచ్చి మాంసాన్ని దానికి పెట్టారు. అనంతరం బతికున్న కోడిని ఎద్దు నోటిలో పెట్టి నమిలించారు. యూట్యూబర్ రఘు ఈ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌ అయ్యింది.మరోవైపు జంతు హక్కుల సంఘం కార్యకర్త, పీపుల్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా వ్యవస్థాపకుడు అరుణ్ ప్రసన్న దీనిపై స్పందించారు. శాకాహార జంతువైన ఎద్దుతో బలవంతంగా మాంసం, బతికున్న కోడిని తినిపించడం దారుణమని అన్నారు. మాంసాహారం తిన్న ఎద్దు ఒకవేళ జల్లికట్టులో గెలిస్తే మిగతా పశువుల యజమానులు ఈ పద్ధతిని అనుసరించే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబర్ రఘుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

* చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ దాడులు

చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లుతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఒక కేసు విషయంలో నిందితుడి దగ్గర నుంచి కానిస్టేబుల్‌ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

* ప్రియురాలిని హత్య చేసి కోడ్ భాషతో దాచిపెట్టిన ప్రియుడు

బ్రేకప్ చెప్పిందనే కసితో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేశాడో ఉన్మాద ప్రేమికుడు. ఆపై మృతదేహం దొరకకుండా అడవీలో దాచిపెట్టి కోడ్ భాషలో సూసైడ్ నోట్ రాసుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నవీ ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..నవీ ముంబైకి చెందిన యువతి (19) డిసెంబరు 12న సియోన్ నుండి కాలేజీకని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కలంబోలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. కాగా కలంబోలికి చెందిన వైభవ్ బురుంగలే, ఆ యువతి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె అతడికి బ్రేకప్ చెప్పింది. దీనిని జీర్ణించుకోలేని వైభవ్ డిసెంబర్ 12 నవీ ముంబైలోని ఖర్ఘర్ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే చెట్ల పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు.ప్రియురాలిని హత్య చేసిన అనంతరం వైభవ్ బురుంగలే అదే రోజు అంటే డిసెంబర్ 12న జుయినగర్ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడి మొబైల్‌లో ‘L01-501’ కోడ్ రాసి ఉంది. ఈ కోడ్‌ను డీకోడ్ చేయడానికి పోలీసులకు 34 రోజులు పట్టింది. పోలీసులతో పాటు, ఫైర్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పోలీసులు నెలకు పైగా శ్రమించి ‘L01-501’ కోడ్ ఓ చెట్టు నంబర్‌గా గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా.. వైభవ్ బురుంగలే ప్రియురాలి మృతదేహం లభ్యం అయింది.డిసెంబర్ 12న వైభవ్ బురుంగలే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం.. అదే రోజు యువతి మిస్సింగ్ కావడం కామన్ పాయంట్‌గా నిలిచింది. ఘటన స్థలంలో యువతి మృతదేహాన్ని చూసిన పేరెంట్స్ దుస్తులు, చేతి గడియారం, గుర్తింపు కార్డు ఆధారంగా తమ అమ్మాయే అని ధ్రువీకరించారు. ఈ సంచలన ఘటనపై నవీ ముంబై పోలీస్ కమిషనర్ మిలింద్ భరాంబే మాట్లాడారు.ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. బురుంగలే మొబైల్ ఫోన్‌లో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారని, అందులో అతను యువతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు రాసి ఉందని తెలిపారు. ఈ సూసైడ్ నోట్‌లో ‘L01-501’ వంటి కోడ్ పదాలు ఉపయోగించబడ్డాయని, ఈ కోడ్ అటవీ శాఖ గుర్తించిన చెట్టు సంఖ్య అని వెల్లడించారు. ఇక్కడ బురుంగలే యువతి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. డిసెంబర్ 12న ఖార్ఘర్ హిల్స్ ప్రాంతంలో యువతి, బురుంగలే ఉన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. యువతి మృతదేహాన్ని వెతకడానికి పోలీసులు లోనావాలా, ఫైర్ సర్వీస్, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుండి వలంటీర్ల సహాయాన్ని తీసుకున్నామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z