DailyDose

విద్యా సంస్థలకు కేంద్రం కీలక సూచనలు

విద్యా సంస్థలకు కేంద్రం కీలక సూచనలు

దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడేళ్లలో భారతీయ భాషల్లోని ప్రతి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. విద్యార్థులకు మాతృభాషలోనే చదువుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్‌, ఇగ్నో వంటి రెగ్యులేటరీ సంస్థల ఆధీనంలోని అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. యూజీసీ, ఏఐసీటీఈలతో పాటు పాఠశాల విద్యా విభాగం రాష్ట్రాల్లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో దీన్ని అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

జాతీయ విద్యా విధానం-2020 సిఫార్సుల మేరకు విద్యలో బహు భాషావాదాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం లభిస్తే.. మెరుగైన అభ్యాసన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. సొంత భాషలో అభ్యసించడం ద్వారా విద్యార్థికి భాషా అవరోధం లేకుండా వినూత్నంగా ఆలోచించే సహజ స్వభావం పెంపొందుతుందని పేర్కొంది. బహుభాషా సంపదను దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. స్థానిక భాషల్లో కంటెంట్‌ను సృష్టించడం ద్వారా బహుభాషా సంపదను పెంచవచ్చని.. తద్వారా 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమవుతుందని అభిప్రాయపడింది. ఆ దిశగానే గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z