Politics

ఇక పార్టీపై ఫోకస్ పెట్టనున్న షర్మిల

ఇక పార్టీపై ఫోకస్ పెట్టనున్న షర్మిల

వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆమె పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో షర్మిలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించి, వచ్చే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీసీసీ చీఫ్‌గా నియమించింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీసీసీ మాజీ చీఫ్‌ గిడుగు రుద్రరాజ్‌ను నియమించారు.

ఘనంగా షర్మిల తనయుడి నిశ్చితార్థం
షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు హాజరయ్యారు ఏపీ సీఎం జగన్‌ దంపతులు. మేనల్లుడు రాజారెడ్డితో పాటు ప్రియను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కలసి ఫొటో దిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు జగన్‌. తల్లిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం విజయవాడకు రిటర్న్‌ అయ్యారు సీఎం జగన్ దంపతులు.

షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు ఏపీ తెలంగాణ నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మోహన్‌ బాబు కుటుంబసభ్యులు వధూవరులను ఆశీర్వదించారు. షర్మిల, అనిల్, రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి పవన్ ఫొటోలకు పోజులిచ్చారు.

వచ్చే నెల17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులను కుమారుడి వివాహానికి ఆహ్వానించారు షర్మిల.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z