Fashion

జయలలిత నగలపై కోర్టు కీలక తీర్పు

జయలలిత నగలపై కోర్టు కీలక తీర్పు

అక్రమార్జన కేసులో తమిళనాడు (Tamil Nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది. 1996 నాటి అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటక (Karnataka)కు బదిలీ చేశారు. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. జప్తు చేసిన విలువైన వస్తువులపై జయలలిత బంధువులకు వీటిపై ఎలాంటి హక్కు లేదని తేల్చింది. ఈ మేరకు ఆమె మేనల్లుడు దీపక్‌, మేనకోడలు దీప వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

ఈ క్రమంలోనే దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు.. ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది. ‘‘ఆభరణాలను వేలం వేసే బదులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి పోలీసులతో కలిసి వచ్చి ఈ ఆభరణాలు తీసుకోవాలి’’ అని కోర్టు వెలువరించింది. అంతేగాక, ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం చేసిన ఖర్చులకు గానూ.. రూ.5 కోట్లు చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా నుంచి ఈ మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వం అందుకోనుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z