* అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్‌రెడ్డిగా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహంగా కనిపించాడాయన. కరుణాకర్ స్థానికంగా ఓ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్ మృతిపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
* ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్లు జరిమానా విధించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ బుధవారం ప్రకటనలో తెలిపింది. సుదూర ప్రాంతాలు, కీలక మార్గాల్లో ప్రయాణించే ఎయిరిండియా విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించడం లేదని సంస్థ ఉద్యోగి ఒకరు డీజీసీఏకి నివేదిక సమర్పించారు. లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణ కూడా సరిగా చేపట్టడం లేదని అందులో ఆరోపించారు. దాని ఆధారంగా విచారణ జరిపిన డీజీసీఏ…ప్రాథమిక దర్యాప్తులో నిబంధనలు అనుసరించడం లేదని నిర్ధారించి జరిమానా విధించడంతో పాటు షోకాజ్ జారీ చేసినట్లు వెల్లడించింది.
* జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన తారక్‌రామ్ (30) మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరో బౌన్సర్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెద్దమ్మగుడి కమాన్ సమీపంలో మలుపు వద్ద వేగంగా వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చొన్న రాజుకు తీవ్రగాయాలయ్యాయి.
* ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ మెడికల్ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు సన్నద్ధమవుతున్నాడు. జవహర్‌నగర్ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గతంలో ఒక సారి నీట్ తప్పి.. రెండోసారి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* కెనడా (Canada)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి కుప్ప కూలిపోయింది (Plane Crash). ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నార్త్‌వెస్ట్ టెరిటరీస్ (Northwest Territories)లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పోర్ట్‌స్మిత్ (Fort Smith) నుంచి కార్మికులతో రియో టింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని ( Diavik diamond mine ) వద్దకు ఆ విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z