Business

అమెజాన్‌కు ₹280కోట్ల జరిమానా-వాణిజ్య వార్తలు

అమెజాన్‌కు ₹280కోట్ల జరిమానా-వాణిజ్య వార్తలు

* ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon)కి ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సీఎన్‌ఐఎల్‌ (CNIL) భారీ జరిమానా విధించింది. ఉద్యోగుల పనితీరుపై మితిమీరిన నిఘా ఉంచినందున 32 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.280 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. యూరోపియన్‌ యూనియన్‌ (EU) జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (GDPR) ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్‌ డేటాను సేకరించినట్లు సీఎన్‌ఐఎల్‌ ఆరోపించింది. దీనిపై ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి జరిమానా విధించినట్లు తెలిపింది.

* దేశీయ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడితో నిన్న భారీగా నష్టపోయిన సూచీలు.. ఆయా షేర్లలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి 1100 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 21,450 పాయింట్ల ఎగువన ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 70,165.49 పాయింట్ల (క్రితం ముగింపు 70,370.55) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. మధ్యలో కాసేపు నష్టాల్లోకి వెళ్లినా ఇంట్రాడేలో ఎక్కువ సేపు లాభాల్లోనే కదలాడింది. చివరికి 689.76 పాయింట్ల లాభంతో 71,060.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 215.15 పాయింట్ల లాభంతో 21,453.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.12గా ఉంది.

* ఇ- కామర్స్‌ సంస్థ ఈబే (ebay) ఉద్యోగులకు ఉద్వాసన (layoffs) పలికింది. తన సంస్థలో పనిచేస్తున్న వారిలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ- మెయిల్‌ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని రౌండ్లలో తొలగింపులు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ‘‘మన వ్యూహాలకు వ్యతిరేక దిశలో కంపెనీ పురోగమిస్తున్నప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి. దీన్ని పరిష్కరించడానికి సంస్థాగత మార్పుల్ని అమలు చేస్తున్నాం. మా కస్టమర్ల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కంపెనీ ఈసీఓ జామీ ఐయానోన్‌ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో తెలిపారు.

* రెసిడెన్షియల్ ప్రాపర్టీల డిమాండ్‌ను పెంచడానికి గృహ రుణాలపై చెల్లించే వడ్డీతో పాటు అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని ‘భారత స్థిరాస్తి సంఘాల సమాఖ్య’ (CREDAI) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనాన్ని సైతం సవరించాలని బడ్జెట్‌ (Union Budget 2024) అంచనాల్లో భాగంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సెక్షన్‌ 80సీ కింద గృహ రుణాల అసలు మొత్తం చెల్లింపులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మరింత విస్తరిస్తూ బడ్జెట్‌లో (Union Budget 2024) ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని క్రెడాయ్‌ కోరింది. లేదా అసలు మొత్తం కింద చేసే చెల్లింపులకు సెక్షన్‌ 80సీకి వెలుపల ప్రత్యేక మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసింది. రూ.45 లక్షలకు పరిమితమైన ‘సరసమైన ఇళ్ల’ (Affordable Housing) నిర్వచనాన్ని సవరించాలని క్రెడాయ్‌ డిమాండ్‌ చేసింది. ఈ పరిమితిని 2017లో నిర్ణయించారని గుర్తుచేసింది. అప్పటితో పోలిస్తే ద్రవ్యోల్బణం, స్థిరాస్తి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ‘నేషనల్‌ హౌసింగ్ బ్యాంక్‌’ గణాంకాల ప్రకారం.. 2018 నుంచి స్థిరాస్తి ధరలు 24 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.45 లక్షల బడ్జెట్‌లో ఇళ్లు నిర్మించడం డెవలపర్లకు సాధ్యం కావడం లేదని వివరించింది. సరసమైన ఇళ్ల నిర్వచనానికి ధరలను కాకుండా విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని క్రెడాయ్‌ సూచించింది. మెట్రో ప్రాంతాల్లో 90 చదరపు మీటర్లు.. మెట్రోయేతర ప్రాంతాల్లో 120 చదరపు మీటర్లలో నిర్మించే వాటిని ఈ కేటగిరీలోకి తీసుకురావాలని సిఫార్సు చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z