DailyDose

డ్రగ్స్ కేసులో పట్టుబడిన టాలీవుడ్ హీరో ప్రేయసి-నేరవార్తలు

డ్రగ్స్ కేసులో పట్టుబడిన టాలీవుడ్ హీరో ప్రేయసి-నేరవార్తలు

* నార్సింగిలో లావణ్య, ఉనీత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హ్యాండ్ బ్యాగ్‌లో ఈ డ్రగ్స్ లభ్యమైంది. ఒక హీరో ప్రియురాలైన లావణ్య.. సంగీతం టీచర్‌గా పని చేస్తోంది. పోలీసుల విచారణలో.. ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చినట్లు లావణ్య తెలిపింది. అయితే.. ఆ డ్రగ్స్‌ని కొన్ని రోజుల క్రితమే ఉనీత్ నుంచి ఆమె కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆ సమాచారంతోనే లావణ్యని SOT పోలీసులు తనిఖీ చేయగా.. హ్యాండ్‌బ్యాగ్‌లో ప్యాకెట్లు దొరికాయి. ఈ ఇద్దరిపై NDPS 22బీ, రెడ్ విత్ 8సీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను రిమాండ్‌కి తరలించారు.

* భారత్‌లోని హరియాణాకు చెందిన 25 ఏళ్ల వివేక్‌ సైనీ రెండేళ్లక్రితమే అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా పొందిన అతడు.. జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ క్లర్క్‌గా చేరాడు. ఇటీవల స్టోర్‌ వద్ద అతడికి జూలియన్‌ ఫాల్కెనర్‌ అనే నిరాశ్రయుడు కన్పించాడు. అతడిని చేరదీసిన వివేక్‌.. రెండు రోజుల పాటు సాయం చేశాడు. చిరుతిళ్లతో పాటు చలి ఎక్కువగా ఉందని వేసుకొనేందుకు తనవద్దనున్న జాకెట్‌ను కూడా ఇచ్చాడు. రోజూలాగే.. జనవరి 16న కూడా జూలియన్‌ స్టోర్‌ వద్దకు వచ్చాడు. అయితే, అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి బయల్దేరిన వివేక్‌ అతడిని అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. అతడు వినిపించుకోకపోవడంతో పోలీసులకు ఫోన్‌ చేస్తానని అన్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న జూలియన్‌ తన దగ్గర ఉన్న సుత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా తలపై కొట్టాడు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికే వివేక్‌ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. అతడు మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. వివేక్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి ఎస్‌. బాలకృష్ణకి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది అనిశా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అధికారులు చెబుతున్నట్లు ఆయనకు అన్ని ఆస్తులు లేవని అందులో పేర్కొన్నారు. అనిశా చెప్పే లెక్కలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగాయని, ఆయన ఏటా ఆదాయపన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. మరోవైపు బాలకృష్ణను పది రోజుల కస్టడీకి కోరుతూ అనిశా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొంది.

* ప్రేమించిన యువతిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిషబ్‌ నిగమ్‌-వందన మధ్య పదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం ఆమె పుణెలోని హింజావాడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలోనే వందన కొంతకాలంగా అతడికి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో రిషబ్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఆమెపై అనుమానం పెంచుకొని.. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

* జీవిత బీమా డబ్బు కోసం ఎన్నారై మహిళను అత్తమామలు హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో రెండు రోజులు ఉంచారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళను హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో బయటపడింది. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమెరికా పౌరురాలైన 32 ఏళ్ల రాజ్‌దీప్ కౌర్ ఐదేళ్ల పాపతో కలిసి జనవరి 12న పంజాబ్‌లోని అత్త వారింటికి వచ్చింది. అయితే ఆమె పేరు మీద భారీగా జీవిత బీమా ఉన్నది. ఈ నేపథ్యంలో నానో మల్లియన్ గ్రామానికి చెందిన అత్తమామలు దల్జీత్ కౌర్, జగదేవ్ సింగ్‌ జనవరి 19 అర్ధ రాత్రి తర్వాత రాజ్‌దీప్ కౌర్ గొంతు నొక్కి హత్య చేశారు. ఆ తర్వాత సిధ్వా డోనా గ్రామంలో ఆమె మృతదేహాన్ని రెండు రోజులు ఫ్రీజర్‌లో ఉంచారు. గుండెపోటుతో చనిపోయినట్లు బ్రిటన్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, రాజ్‌దీప్ కౌర్ తల్లి నిర్మల్‌ కౌర్‌ బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చింది. తన కుమార్తె మరణంపై ఆమె అనుమానం వ్యక్తం చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని, పెళ్లి వేడుక పేరుతో రప్పించి జీవిత బీమా డబ్బు కోసం హత్య చేశారని ఆరోపించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z