Business

IMPS బదిలీకి కొత్త నిబంధన-వాణిజ్య వార్తలు

IMPS బదిలీకి కొత్త నిబంధన-వాణిజ్య వార్తలు

* దేశంలో ఫిబ్రవరి 1, 2024 నుంచి తక్షణ చెల్లింపు సేవల (IMPS) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్, వారి బ్యాంక్ పేరును ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయవచ్చు. ఇది పేమెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖాతా నంబర్లు లేదా IFSC కోడ్‌ వంటి లబ్ధిదారుల వివరాలు సమర్పించకుండానే రూ.5 లక్షల వరకు బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.

* గతవారం డీలాపడిన మన మార్కెట్లు.. ఈ వారం బౌన్స్‌ బ్యాక్ అయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్‌ కౌంటర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు (Stock market) ఊతమిచ్చింది. గత వారం తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు రాణించాయి. దీంతో సెన్సెక్స్‌ 1200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 21,700 మార్కు ఎగువన ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 70,968.10 (క్రితం ముగింపు 70,700.67) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 72,010.22 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1240.90 పాయింట్ల లాభంతో 71,941.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 385.00 పాయింట్ల లాభంతో 21,737.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.14గా ఉంది. సెన్సెక్స్‌లో ఐటీసీ, ఇన్ఫీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ 83.35 డాలర్ల స్థాయి వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2027 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపరుల విక్రయాలు, క్రూడాయిల్‌ ధరలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.

* కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు కోలుకున్న నేపథ్యంలో.. ఉద్యోగులు కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని అనేక కంపెనీలు ఆదేశిస్తున్నాయి. పని రోజులను మార్చడం కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జర్మన్‌ కంపెనీలు పని రోజులను తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వారానికి 4 రోజుల పని (4-day work) ఎలా ఉంటుందనే విషయంపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి నుంచి ఆరు నెలల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మొదలయ్యే ఈ అధ్యయనం.. ఆరు నెలల పాటు కొనసాగనుంది. 45 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన 4డే వీక్‌ గ్లోబల్‌ (4 Day Week Global) అనే స్వచ్ఛందసంస్థ ఈ పైలట్‌ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తోంది. దీని ప్రకారం, ఉద్యోగులు వారానికి కొన్ని గంటలే పని చేయాల్సి ఉంటుంది. జీతం మాత్రం పూర్తిగా చెల్లిస్తారు. అయితే, పని ఫలితం మాత్రం గతంలో మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండేలా చూడాలి. ఇలా పనితీరు మెరుగవడంతో పాటు ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తగ్గడం, తద్వారా సెలవులు తీసుకోవడం కూడా తగ్గనుందని 4డే వీక్‌ అంచనా వేస్తోంది. ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ నివేదిక ప్రకారం, 2022లో జర్మన్‌లు సగటున 21.3 రోజుల పాటు పనిచేయలేకపోయినట్లు తేలింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ 207 బిలియన్‌ యూరోలు నష్టపోయినట్లు అంచనా వేసింది. అంతేకాకుండా సంతోషంగా లేని ఉద్యోగులు పనిలో ఏకాగ్రత కనబరచకపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.1 ట్రిలియన్‌ యూరోలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) ఈ ఏడాది నుంచి భారత్‌లో ల్యాప్‌టాప్‌లు తయారుచేయనుంది. సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు సోమవారం ఈవిషయాన్ని వెల్లడించారు. నోయిడాలోని తయారీ యూనిట్‌లో వీటి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘‘శాంసంగ్‌ సంస్థకు భారత్‌లోని తయారీ కేంద్రాలు ఎంతో కీలకమైనవి. సంస్థ ప్లాంట్‌లలో నోయిడా యూనిట్‌ రెండో అతి పెద్దది. దీని ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎంతగానో సహకరించాయి. ఈ ఏడాది నుంచే ఇందులో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రపంచ స్థాయి డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తుల తయారీకి ప్లాంట్‌లో కొన్ని మార్పులు చేస్తాం’’ అని శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్‌ టీఎమ్‌ రోహ్‌ తెలిపారు.

* ‘సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI)’ దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి (Lab grown fish meat) చేయనుంది. సీఫుడ్‌ (seafood)కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సముద్రజీవుల సమతౌల్యాన్నీ సంరక్షించొచ్చని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ల్యాబ్‌ సెటప్‌లో అభివృద్ధి చేసి మాంసాన్ని (Lab grown fish meat) ఉత్పత్తి చేస్తామని CMFRI వివరించింది. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయని తెలిపింది. తొలి దశలో కింగ్‌ ఫిష్‌, చందువాయి చేప, సీర్‌ఫిష్‌ మాంసాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఈమేరకు కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ ‘నీట్‌ మీట్‌ బయోటెక్‌’తో చేతులు కలిపినట్లు చెప్పింది. ఇరు సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z