NRI-NRT

కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ప్రభుత్వం షాక్

కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ప్రభుత్వం షాక్

కెనడాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్‌ డిపాజిట్‌ను భారీగా పెంచిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త నిబంధన అమలుకు సిద్ధమైంది. దీని ద్వారా విదేశీ విద్యార్థులకు ఆఫ్‌-క్యాంపస్‌లో ఇక నుంచి వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక నిబంధన ప్రకారం.. వారానికి గరిష్ఠంగా 40 గంటలు పనిచేసుకునే సౌలభ్యం ఉండేది. ట్రూడో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత్‌ విద్యార్థులపైనా ప్రభావం చూపనుంది.

ఆఫ్‌-క్యాంపస్‌ పనిపై పరిమితి విధించడం వల్ల కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగం కంటే విద్యపై ఎక్కువ దృష్టి పెట్టడంలో దోహదపడుతుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌, రిఫ్యూజీ, సిటిజెన్‌షిప్‌ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్‌ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు విద్య కోసమే ఉండాలని, పని కోసం కాదన్నారు. కొవిడ్‌-19 విజృంభణ సమయంలో దేశంలో నెలకొన్న శ్రామిక శక్తి కొరతను ఎదుర్కొనేందుకు ట్రూడో ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులు వారానికి గరిష్ఠంగా 40 గంటలు పని చేసుకునే వీలు కల్పించింది. ఈ తాత్కాలిక నిబంధన గతేడాది ముగిసినప్పటికీ.. ఏప్రిల్ 30వరకు పొడిగించింది. తాజాగా దీన్ని కొనసాగించాలనుకోవడం లేదని.. వారానికి 24 గంటలు పనిచేసుకునే నిబంధన కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కెనడాలో సెప్టెంబర్‌ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

వారానికి 28 గంటల కంటే ఎక్కువ పనిచేసే విదేశీ విద్యార్థులు.. చదువులో వెనకబడిపోతున్నట్లు అమెరికా, కెనడాలో ఇటీవల జరిపిన అధ్యయనాల్లో తేలినట్లు ట్రూడో ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయంలో పనిచేసే విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపివేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తావించింది. ఉన్నత విద్య కోసం వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు పని చేసుకోవడంపై అనేక దేశాలు పరిమితులు విధిస్తుంటాయని, ఆస్ట్రేలియా కూడా రెండు వారాలకు 48 గంటలు మాత్రమే పని చేసుకునేలా ఇటీవల నిబంధనలు తెచ్చిందని తెలిపింది. అమెరికాలో ఆఫ్‌క్యాంపస్‌లో పని చేసుకోవాలనుకునే విద్యార్థులు అదనపు ప్రమాణాలు కలిగి ఉండాలనే విషయాన్ని తాజా ప్రకటనలో కెనడా పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z