ఇటీవల జరిగిన టోర్నమెంట్‌లో భాగంగా కొందరు వీక్షకుల నుంచి తాను చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్(Indian Chess Player) దివ్యాదేశ్‌ముఖ్(Divya Deshmukh) ఆవేదన వ్యక్తం చేశారు. వారు అనవసర విషయాలపై దృష్టిపెట్టారని వాపోయారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన దివ్య(Divya Deshmukh) తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెప్పాలని అనుకుంటున్నా. అయితే నా టోర్నీ ముగిసేవరకు వేచి ఉన్నాను. క్రీడాకారిణులతో వీక్షకులు ఎలా వ్యవహరిస్తారో నేను గమనించాను. వారు ఆట మీద కంటే నా కురులు, దుస్తులు, యాస వంటి అనవసర విషయాలనే పట్టించుకుంటున్నారని తెలిసింది’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. క్రీడలో సామర్థ్యంతో సంబంధం లేకుండా తమపై ఓ అభిప్రాయానికి వస్తుంటారని, అలాంటివారి తీరు బాధించిందని ఆమె అన్నారు. అలాగే పురుషులతో పాటు మహిళలకు కూడా క్రీడల్లో సమాన హోదా దక్కాలని ఆశించారు. 18 ఏళ్ల దివ్య గత ఏడాది ఆసియా మహిళల చెస్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. ఇటీవల జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ 4.5 స్కోర్‌తో 12వ ర్యాంకుతో ఆటను ముగించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z