Politics

తెలంగాణాలో BRS చచ్చింది: రేవంత్

తెలంగాణాలో BRS చచ్చింది: రేవంత్

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ చచ్చిపోయిందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పోరు బీజేపీతోనే టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. బావ, బామ్మర్దులు ఇటీవల బీజేపీని పల్లెత్తుమాట అనకుండా కాంగ్రెస్‌ను విమర్శించడమే బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేననడానికి నిదర్శనమని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికలపై మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ మీటింగ్‌ తర్వాత రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘మోదీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 17 సీట్లు గెలవాల్సిందే. కేంద్రంలో కాంగ్రెస్‌​ గెలిస్తేనే విభజన హామీలు పరిష్కారం అవుతాయి. పదేళ్లలో విభజన హామీలను కేసీఆర్‌ అడగలేదు. మోదీ నెరవేర్చలేదు. రాహుల్‌ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం. భారత్‌ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ విమర్శలు చేయడం సరికాదు. పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాం. మార్చి 3వ తేదీ వరకు ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తాం. ఎన్నికల సెలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీకి గుజరాత్‌ నేత జిగ్నేష్‌ మెవానీ అధ్యక్షత వహిస్తారు. మార్చి 15 నుంచి 20 లోపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) లోక్‌సభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటుంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసే సభతో పార్లమెంట్‌ ఎన్నికలకు సమరశంఖం పూర్తిస్తాం.” అని రేవంత్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z