Politics

తెదేపా-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు-తాజావార్తలు

తెదేపా-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు-తాజావార్తలు

* తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో ఆ పార్టీ శాసన సభాపక్షం భేటీ అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది.

* ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ జాప్యం చేస్తోందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హామీల అమలుకు తేదీలు చెప్పింది కాంగ్రెస్‌ నేతలు కాదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి విషయం లేక విషం చిమ్ముతున్నారని అన్నారు.

* జగన్‌.. తనని తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్‌ మాట్లాడారు. ‘పవర్‌స్టార్‌గా కంటే ప్రజలకోసం పనిచేసే కూలీగా గుర్తిస్తే గర్వపడతా. పదవులపై నాకు ఆశలేదు. అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు’అని అన్నారు.

* దేశ రాజధాని దిల్లీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చెల్లి మీద అక్కసుతో సొంత ఇంట్లోనే ఓ మహిళ చోరీకి పాల్పడింది. తన తల్లి ఎంతో భద్రంగా దాచుకున్న బంగారు నగలు, నగదును కొట్టేసింది. మళ్లీ ఏమీ ఎరగనట్లు పోలీసుల ఎదుట కన్నీరు పెట్టింది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

* విశాఖపట్నం వేదికగా భారత్ – ఇంగ్లాండ్‌ మధ్య (IND vs ENG) రెండో టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో.. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్‌ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్‌లో జాక్‌ క్రాలే (29*), రెహాన్ అహ్మద్ (9*) ఉన్నారు.

* కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌.. చిరంజీవి ఇంట సందడి చేశారు. కేంద్రం చిరుకి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కంగ్రాట్స్‌ చెప్పేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సంబంధిత ఫొటోలను చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకోగా.. అందులో చిరు అందుకున్న ‘నంది’సహా పలు అవార్డులతోపాటు తనయుడు, హీరో రామ్‌ చరణ్‌తో కలిసి దిగిన ఫొటో ఉంది.

* భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తన పర్యటన విశేషాలను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్‌ వీడియోను ఆయన పోస్టు చేశారు. సందర్శించిన ప్రదేశాలు, సైనిక కవాతు, ప్రముఖులతో సమావేశాలు తదితర సందర్భాలను అందులో చూపించారు.

* ప్రయోగానికి సిద్ధం చేసిన హూతీ క్షిపణిని తాము ధ్వంసం చేసినట్లు అమెరికాసెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఆత్మరక్షణ నిమిత్తం శనివారం రాత్రి యెమెన్‌పై అమెరికా-యూకే వైమానిక దాడి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎర్ర సముద్రంలో ఓ నౌకలపై దాడికి హూతీలు యాంటీ షిప్‌ మిసైల్‌ను సిద్ధం చేశారు. దీనిని అమెరికా దళాలు ధ్వంసం చేశాయి.

* భారత్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (IOA) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)పై సస్పెన్షన్‌ విధిస్తూ ఈసీ సభ్యుల కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఓఏ సభ్యులు అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ రాశారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన రఘురామ్‌కు నెలకు రూ. 20 లక్షలు వేతనంగా ఇవ్వడంతోపాటు ఇతర భత్యాలు కలిపి ఏడాదికి దాదాపు రూ. 3 కోట్ల వరకు చెల్లించడం సరైంది కాదని లేఖలో సభ్యులు తెలిపారు.

* గతేడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్‌ రద్దీ గల నగరంగా బ్రిటన్‌ రాజధాని లండన్ నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకుపైగా పడుతున్నట్లు ‘టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ సూచీ-2023’లో వెల్లడైంది. డబ్లిన్‌ (ఐర్లాండ్‌), టొరంటో (కెనడా)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

* కర్నాటకలో మంకీ ఫీవర్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది వరకు సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరారు. మిగతా వారంతా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఇంత వరకు ఎలాంటి తీవ్రమైన కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. మంకీ ఫీవర్‌ తొలి కేసు జనవరి 16న నమోదైంది. మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) పేరుతోనూ పిలుస్తుంటారు.

* ఝార్ఖండ్‌లో (Jharkhand) రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జేఎంఎం సీనియర్‌ నేత చంపయీ సోరెన్‌ (Champai Soren) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ.. అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయేలా ఉంది. నోటి దగ్గర ముద్దను భాజపా (BJP) లాక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని జేఎంఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వారందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు జేఎంఎం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

* సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశం ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్‌ ఈ మేరకు తెదేపా అధినేతతో దాదాపు 3గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. రాజోలు, రాజానగరం స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చాయి. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఇద్దరు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో తెదేపా ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్ఠానం హామీ ఇవ్వనుండగా.. తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు సర్దిచెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు జనసేన అధిష్ఠానం హామీ ఇవ్వనుంది. ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక మంచి రోజు చూసుకుని స్థానాలను ప్రకటించే యోచనలో చంద్రబాబు, పవన్‌ ఉన్నట్టు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z