Business

టాటా-రిలయన్స్ చెట్టాపట్టాల్-BusinessNews-Feb152024

టాటా-రిలయన్స్ చెట్టాపట్టాల్-BusinessNews-Feb152024

* రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్‌ని నిలిపివేయాలని సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నల్లధనాన్ని రూపుమాపడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్లు విక్రయించరాదని కోర్టు తీర్పునిచ్చింది.

* భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ‘ముఖేష్ అంబానీ’ సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్‌లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్‌కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది.

* సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు చెప్పినట్లుగానే.. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది.

* గూగుల్‌ను అడిగితే చెప్పలేందంటూ ఉండదు. దాదాపు ప్రపంచంలోని అన్ని అంశాలకు చెందిన సమాచారం అంతా అందులో దాగిఉంది. ఏదైనా వస్తువు కొనాలంటే వెంటనే గూగుల్‌లోకి వెళ్లి రేటింగ్‌ చూడటం అలవాటైంది. కానీ నిజంగా అందులో ఇస్తున్న సమీక్షల్లో నిజమెంతనే అనుమానం రాకపోదు. కొందరు కావాలనే కొన్ని ప్రొడక్ట్‌లకు ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ రేటింగ్‌ ఇస్తూ సామాన్యులను మోసం చేస్తున్నట్లు గూగుల్‌ గుర్తించింది. గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి గూగుల్ మ్యాప్స్, సెర్చింగ్ లో 170 మిలియన్లకు పైగా పాలసీ ఉల్లంఘించే రివ్యూలను బ్లాక్ చేసినట్లు తెలిసింది. గతేడాది కంటే 45 శాతం ఎక్కువ నకిలీ రివ్యూలను తొలగించేందుకు ఈ అల్గారిథమ్ సహాయపడిందని గూగుల్ తెలిపింది. వీటితోపాటు 12 మిలియన్లకు పైగా నకిలీ వ్యాపార ప్రొఫైల్‌లను గుర్తించి బ్లాక్ చేసినట్లు చెప్పింది. గతేడాది గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ప్రారంభించింది. ఇది రోజువారీ దీర్ఘకాలిక సంకేతాలను పరిశీలించి వేగంగా నకిలీ రివ్యూలను గుర్తిస్తుంది. దీంతోపాటు వీడియో మోడరేషన్ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా 2023లో 14మిలియన్ల పాలసీ ఉల్లంఘనల వీడియోలను గుర్తించినట్లు గూగుల్‌ తెలిపింది. ఇది గతేడాది కంటే 7 మిలియన్లు ఎక్కువ. 2 మిలియన్ల హ్యాకర్ అటెంప్ట్‌ల నుంచి వ్యాపార యజమానులను రక్షించినట్లు గూగుల్ పేర్కొంది. ఇది 2022లో 1 మిలియన్‌గా ఉంది.

* పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్‌ ప్రతినిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్‌లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్‌లో వన్‌97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్‌లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రష్యా ప్రజల శుభవార్త చెప్పారు. కొన్నాళ్ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి త్వరలో ఫలితం దక్కనుందని తెలిపారు. అతి త్వరలో ప్రాణాంతకమైన క్యాన్సర్‌కు రష్యా వైద్య శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు వాక్సిన్‌ తయారు చేసి అందుబాటులోకి తీసుకురానున్నారని వెల్లడించారు.

‘మేము ఒక క్యాన్సర్‌ కొత్త జనరేషన్‌కు సంబంధించి వ్యాక్సిన్‌లు, ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ తయారికి దగ్గరగా వచ్చాం. అతి త్వరలో కొత్తగా తయరు చేసిన క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది వ్యక్తిగత థెరపీకి ఈ వ్యాక్సిన్‌ వినియోగంలోకి వస్తుంది’అని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. అయితే ఎటువంటి క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టబోతున్నారన్న విషయాన్ని మాత్రం అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించకపోవటం గమనార్హం. పలు దేశాలు, కంపెనీలు క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ తయారికి కృషి చేస్తున్నాయి. గత ఏడాది బ్రిటన్‌ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ కంపెనీతో ఒప్పదం చేసుకుంది. 2030 నాటికి సుమారు పదివేల మంది పేషెంట్లలకు క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా క్యాన్సర్‌ చికిత్స అందిచాలని లక్ష్యం పెట్టుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ అండ్‌ కో ఒక ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. సుమారు మూడేళ్ల చికిత్స తర్వాత ప్రాణాంతకమైన చర్మ క్యాన్సర్‌ మెలనోమా పేషెంట్లలో మరణం సంభవించే అవకాశాన్ని సగానికి తగ్గించనుందని ఆయా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ ద్వారా తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో రష్యా స్పూతినిక్‌-వి అనే వ్యాక్సిన్‌ తయారు చేసిన విషయం తెలిసిందే. తమ దేశం తయారు చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా తీసుకొని ప్రజలకు నమ్మకం కల్పించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z