Politics

27న కాంగ్రెస్ హామీల అమలు-NewsRoundup-Feb232024

27న కాంగ్రెస్ హామీల అమలు-NewsRoundup-Feb232024

* సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్ జీవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన స్థానంలో మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. జనగామ కలెక్టర్‌గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్‌ను నియమించారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న సీహెచ్ శివలింగయ్యను బదిలీ చేసిన ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజ రామయ్యర్‌కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

* కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు.

* భాజపా(BJP)పై దిల్లీ మంత్రి, ఆప్‌(AAP) నేత గోపాల్‌రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సీబీఐ నోటీసులు ఇప్పించి, ఆయన్ను అరెస్టు చేయించాలని కుట్ర పన్నుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

* టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్‌ మార్చాలన్న పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

* ఈ నెల 28న జనసేన-తెదేపా సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్‌ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు.

* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధాని మోదీ(Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసి(Varanasi)లో మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ స్పందన వచ్చింది. ఈమేరకు ఆయన తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మతిస్థిమితం కోల్పోయిన వారు వారణాసిలోని నా పిల్లల్ని తాగుబోతులు అంటారు. అసలు అదేం భాష..? మోదీని దుర్భాషలాడుతూ రెండు దశాబ్దాలు గడిపారు. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ యువతపై తమ చిరాకును వెళ్లగక్కుతున్నారు. యూపీ యువత లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోం. కాంగ్రెస్ ఒక కుటుంబం ఎదుగుదల కోసమే పాటుపడుతుంది. అలాగే ఓటు బ్యాంకును దాటి ఆలోచించదు. రామమందిర నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ అసలు ఊహించలేదు. కాశీ, అయోధ్యలో వస్తోన్న మార్పు ‘ఇండియా’ కూటమి అశాంతికి కారణం’ అని విమర్శించారు. అలాగే ఇండియా కూటమి జిత్తులు వారణాసిలో పనిచేయవని దుయ్యబట్టారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.

* ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో చైనా వైఖరిపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడం, అవి కొనసాగించడమనేది ఇరు దేశాలకు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారుతుందన్నారు. తక్షణ సమస్య మాత్రం బీజింగ్‌ (China) నిబంధనలు పాటించకపోవడమేనని.. అదే తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణకు దారితీస్తోందన్నారు.

* ‘మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తాం’ ఇదే విషయాన్ని ఉద్యోగులకు చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.

* ఐఏఎస్‌ అధికారిణి సోనాల్‌ గోయల్‌ (IAS officer Sonal Goel) ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ వైరలైంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రేరేపించేలా తన మొదటి అటెంప్ట్‌లో మెయిన్స్‌లో వచ్చిన మార్క్‌షీట్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. 2007లో జనరల్ స్టడీస్ పేపర్‌లో తక్కువ మార్కులు రావడంతో ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించలేకపోయానని ఆమె తెలిపారు. కాని దానితో కుంగిపోకుండా మరింత కఠిన దీక్ష, నిరంతర అభ్యాసంతో జనరల్‌ స్టడీస్‌పై పట్టు సాధించడానికి నోట్స్‌ తయారుచేసుకోవడం, మెయిన్స్‌లో జవాబులు రాసే విధానంపై పదే పదే ప్రాక్టీస్‌ చేసేదాన్నని తెలిపారు. దానివల్లే 2008లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కలెక్టర్‌ కావాలన్న తన కలను నిజం చేసుకోగలిగానని గోయల్ చెప్పుకొచ్చారు.

* రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

* కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్ర‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ప‌టాన్‌చెరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని సుల్తాన్‌పూర్ వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్ర‌మాదానికి గురైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z