Business

బైజూస్ యాజమాన్యంపై దావా-BusinessNews-Feb232024

బైజూస్ యాజమాన్యంపై దావా-BusinessNews-Feb232024

* ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byjus)కు రోజుకో చిక్కొచ్చి పడుతోంది. సీఈఓ రవీంద్రన్‌ (Byju Raveendran) తొలగింపును ప్రతిపాదిస్తూ ప్రత్యేక అసాధారణ సమావేశానికి సిద్ధమైన ఇన్వెస్టర్లు ఆ దిశగా మరో ముందడుగు వేశారు. కంపెనీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్‌సీఎల్‌టీ (NCLT) బెంగళూరు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. యాజమాన్యంపై ‘అణచివేత, దుర్వినియోగ దావా’ దాఖలు చేశారు. కంపెనీని నడిపించేందుకు సీఈఓ రవీంద్రన్‌ సహా ఇతర వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కొత్త బోర్డు ఏర్పాటుకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) స్వచ్ఛందంగా కార్ల రీకాల్‌ చేపట్టింది. పెట్రోల్‌ వేరియంట్‌ సెల్టోస్‌ మోడల్‌కు చెందిన 4,358 యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంప్‌ కంట్రోలర్‌ను మార్చేందుకు ఈ రీకాల్ చేపట్టినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య తయారైన ఐవీటీ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన పెట్రోల్‌ మోడల్‌ను వెనక్కి రప్పిస్తున్నామని కియా పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో లాభాల స్వీకరణతో ఫ్లాట్‌గా ముగిశాయి. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, ఐటీసీ షేర్లలో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. సెన్సెక్స్‌ ఈ ఉదయం 73,394.44 వద్ద (క్రితం ముగింపు 73,158.24) లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,413.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 15.45 పాయింట్ల నష్టంతో 73,142.80 వద్ద ముగిసింది. నిఫ్టీ ఆరంభంలోనే 22,297.50 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసేసరికి 4.75 పాయింట్ల నష్టంతో 22,212.70 వద్ద స్థిర పడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.94గా ఉంది.

* ఏదైనా కంపెనీ మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తే.. ఆ స్టాక్ రాణించడం సహజమే. దాని ప్రభావంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కానీ, ఒక కంపెనీ ఒక రోజు సంపద కొన్ని కంపెనీల మార్కెట్‌ విలువలను దాటేస్తే దాన్ని ప్రభంజనమే అనాలి. ఆ ఘనతను సాధించింది అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia). ఆ కంపెనీ షేర్లు ఒక్క రోజులో 16 శాతం రాణించడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 277 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. భారత్‌కు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ కంటే ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

* జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ (Jio Financial Services Mcap) రూ.2 లక్షల కోట్లు దాటింది. కంపెనీ షేర్లు వరుసగా ఐదో రోజైన శుక్రవారమూ దూసుకెళ్తున్నాయి. నేడు ఓ దశలో షేరు విలువ పది శాతానికి పైగా పెరిగి రూ.347 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది 41 శాతం రిటర్న్స్‌ ఇవ్వడం విశేషం. గత ఐదు రోజుల్లోనే షేరు విలువ 17 శాతం మేర పుంజుకుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z