DailyDose

డ్రగ్స్ కేసులో సోమవారం నాడు క్రిష్ విచారణ-CrimeNews-Feb 29 2024

డ్రగ్స్ కేసులో సోమవారం నాడు క్రిష్ విచారణ-CrimeNews-Feb 29 2024

* రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్‌ అబ్బాస్‌ డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. వివేకానంద్‌ కొకైన్‌ కావాలని కోరినపుడు మీర్జా వాహిద్‌ నుంచి అతడు తీసుకొచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధాలపై మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. సోమవారం వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

* కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కామారెడ్డి – భిక్క‌నూరు మండ‌లం జంగంప‌ల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బ‌స్సు వాట‌ర్ ట్యాంక‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ గోపాల్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప‌ది మంది ప్ర‌యాణికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

* నాలుగు రోజుల కిందట అదృశ్యమైన బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం (BJP worker’s body) ఒక ప్లేస్కూల్‌లో లభించింది. వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల వర్షా, బీజేపీ మహిళా కార్యకర్త. సోహన్ లాల్ అనే వ్యక్తితో కలిసి నరేలాలోని స్వతంత్ర నగర్‌లో ప్లేస్కూల్‌ ఏర్పాటు చేస్తున్నది. ఫిబ్రవరి 23న అతడితో కలిసి కనిపించిన ఆమె ఆ తర్వాత అదృశ్యమైంది.

* ఇద్దరు బాలికల మృతదేహాలు (Girls’ Bodies In Tree) చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి కొత్వాలి ప్రాంతంలోని గ్రామంలో ఒక చెట్టుకు వేలాడుతున్న 16, 14 ఏళ్ల వయసున్న బాలికల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. కాంట్రాక్టర్‌ కుమారుడు, మేనల్లుడు వారిద్దరికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఇటుక బట్టీలో పని చేసే బాలికల కుటుంబం ఆరోపించింది. దీనిని వీడియో తీయడంతో అవమానం తట్టుకోలేక ఇద్దరు బాలికలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన కాకినాడలోని జగన్నాథపురం పప్పుల మిల్లు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందుల నూకరాజుకు 2016లో దివ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురువారం బయటికి వెళ్లివచ్చిన నూకరాజు.. భార్య దివ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని విచక్షణా రహితంగా నరికాడు. అడ్డువచ్చిన మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. దాడి తర్వాత నిందితుడు నూకరాజు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

* నగర చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారిణి (CDPO) అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్‌ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z