ScienceAndTech

రూఫ్‌టాప్ సోలార్ ద్వారా ₹78వేల సబ్సిడీ-BusinessNews-Feb 29 2024

రూఫ్‌టాప్ సోలార్ ద్వారా ₹78వేల సబ్సిడీ-BusinessNews-Feb 29 2024

* సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అమలు దిశగా మరో ముందడుగు పడింది. ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన (PM-Surya Ghar: Mufti Bijli Yojna)’కు కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనుంది. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ (Rooftop solar scheme)కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు వెబ్‌సైట్‌లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత బడ్జెట్‌లోనూ దీనికి కేటాయింపులు చేయగా.. ఫిబ్రవరి 13న ప్రధాని ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నవారు ఒక కిలోవాట్‌ సోలార్‌ ప్యానళ్లకు రూ.30వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. మిగిలినది బ్యాంకు రుణం కల్పిస్తారు. రెండు కిలోవాట్‌లకు రూ.60 వేలు, మూడు అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు రూ.78వేలు రాయితీగా ఇస్తారు.

* సెమీ కండక్టర్ల (semiconductor) విషయంలో దేశం స్వావలంబన సాధించే దిశగా కేంద్రం మందడుగు వేసింది. రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో మూడు సెమీకండక్టర్‌ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గుజరాత్‌, అస్సాంలలో ఈ ప్లాంట్లు ఏర్పాటుకానున్నాయి. రాబోయే వంద రోజుల్లో వీటి నిర్మాణపనులు ప్రారంభం కాబోతున్నాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) తెలిపారు. ప్రధాని మోదీ (PM modi) నేతృత్వంలో గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను వెల్లడించారు.

* పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ‘సుజ్లాన్‌’ గురువారం గ్లోబల్‌ పవర్‌ కంపెనీ అయిన ఈడీఎఫ్‌ రెన్యువబుల్స్‌ నుంచి 30 మెగావాట్ల పవన విద్యుత్‌ (Wind Power Energy) ప్రాజెక్ట్‌ కోసం ఆర్డర్‌ను పొందినట్లు తెలిపింది. ఈ ఆర్డర్‌లో భాగంగా సుజ్లాన్‌ గుజరాత్‌లో హైబ్రిడ్‌ లాటిస్‌ ట్యూబ్యులర్‌ (HLT) టవర్‌తో 10 విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను (WTG) ఇన్‌స్టాల్‌ చేస్తుంది. ఒక్కొక్కటి 3 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సుజ్లాన్‌.. సరఫరా, పర్యవేక్షణ, కమీషనింగ్‌, పోస్ట్‌-కమీషనింగ్‌ లాంటి సేవలను నిర్వహిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (GUVNL)కు సరఫరా చేస్తారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) బుధవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ చివరకు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 72,220.57 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,099 – 72,730 మధ్య చలించిన సూచీ.. చివరికి 195.42 పాయింట్ల లాభంతో 72,500.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 21,982.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు రాణించాయి. టాటా మోటార్స్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.91గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.37 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు ధర 2042 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* నియంత్రణపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం (Paytm) నుంచి సాఫ్ట్‌బ్యాంక్ మరిన్ని వాటాలను విక్రయించింది. గత నెల రోజుల్లో ఓపెన్‌ మార్కెట్ ద్వారా దాదాపు 13.7 మిలియన్ల షేర్లను అమ్మేసింది. దీంతో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో ఆ కంపెనీ వాటా 5.01 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గినట్లు గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది. 2022 సెప్టెంబరు నాటికి పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు (SoftBank) 17.5 శాతం వాటా ఉండేది. అప్పటినుంచి పలుమార్లు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా తమ వాటాలను విక్రయిస్తూ వచ్చింది. చివరిసారిగా జనవరి 24న మరో రెండు శాతం వాటాను కుదించుకున్నట్లు వెల్లడించింది. మొత్తానికి పేటీఎం నుంచి పూర్తిగా నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

* మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (Bill Gates) ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సందర్శించిన ఆయన.. భారత్‌లోని వివిధ ప్రాంతాలనూ సందర్శిస్తున్నారు. స్థానిక సంస్కృతిని తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులోభాగంగా సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయిన డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్‌ను టేస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనే స్వయంగా పంచుకున్నారు.

* 2022 న‌వంబ‌ర్‌లో చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన‌ప్ప‌టి నుంచి జ‌న‌రేటివ్ ఏఐ ప‌ట్ల టెక్ ప్ర‌పంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఈ టెక్నాల‌జీ ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌రుస్తుంద‌ని, ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని కొంద‌రు చెబుతుండ‌గా, న్యూ టెక్నాల‌జీతో ఉద్యోగాలు క‌నుమ‌రుగ‌వుతాయ‌ని మ‌రికొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ జ‌న‌రేటివ్ ఏఐ ప్ర‌భావంపై బాంబు పేల్చారు. ఈ టెక్నాల‌జీతో మ‌నుషులు చేసే ఉద్యోగాల‌పై వేటు త‌ప్ప‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏఐ రాక‌తో భ‌విష్య‌త్‌లో కంపెనీలు త‌క్కువ సంఖ్యలో ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటాయ‌ని చెప్పారు. జ‌న‌రేటివ్ ఏఐ వంటి న్యూ టెక్నాల‌జీస్‌తో రాబోయే రోజుల్లో కంపెనీల‌కు కొద్దిమంది ఉద్యోగులు స‌రిపోతార‌ని, ఫ‌లితంగా హైరింగ్ కుచించుకుపోతుంద‌ని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌, కో హెడ్ (డెలివ‌రీ) స‌తీష్ హెచ్‌సీ చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z