Health

Depression: హికికొమోరి – ఏమిటీ కిరికిరి!

Depression: హికికొమోరి – ఏమిటీ కిరికిరి!

తన పేరేదైతేనేం. కాసేపు మీకు నచ్చిన పేరే పెట్టుకోండి. తనది ఓ అందమైన జీవితం. చూసేవారికి అసూయ కలిగించే కెరీర్‌. ఏ మజిలీలోనూ వెనకబడింది లేదు. స్కూల్‌, కాలేజ్‌ చదువులను అలవోకగా దాటేశాడు. ఎంట్రెన్స్‌ టెస్టుల్లో టాప్‌ ర్యాంకులు సాధించాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. ఆఫీసులో తన మాటకు తిరుగులేదు. ఎంత క్లిష్టమైన ప్రాజెక్ట్‌ అయినా తనే ఆపద్బాంధవుడు. దేవుడు అడిగితేనే వరం ఇస్తాడని అంటారు. కానీ తనకు అడక్కుండానే, ఒకదాని తర్వాత మరొకటిగా వరాలూ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. అలాంటిది… తను అకస్మాత్తుగా తన స్నేహితులతో మాట్లాడటం మానేశాడు. మొహాన నవ్వు లేదు. పలకరిస్తే జవాబు సరిగా రాదు. ఇంకొన్నాళ్లకు ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేశాడు. ఇంటికి వెళ్లినవాళ్లకు, తను గదిలోంచి బయటికి వచ్చి కనిపించడు. ఏం జరిగిందని అడిగితే కుటుంబసభ్యుల దగ్గరా సరైన జవాబు లేదు. ఇంతకీ తను… ఒంటరితనాన్ని ఎంచుకున్నాడు. తనలోకి తనే కూరుకుపోతున్నాడు. సమాజం నుంచి దూరమైపోతున్నాడు. తన పేరేదైనా కానీ. ఒక్కడు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కోవడం లేదు. ఈ నిర్బంధ ఒంటరితనం కోట్లాదిమంది ఎంచుకుని తగిలించుకుంటున్న పంజరం. హికికొమోరి అనే ఓ జపనీస్‌ ట్రెండ్‌ ఆధారంగా, మహమ్మారిలా మారుతున్న ఒంటరితనం గురించి మాట్లాడుకునే ప్రయత్నమిది!

ఏకాంతం ఓ ఔషధం. మన ఆలోచనల తీరును గమనించేందుకు, చుట్టూ జరుగుతున్నది విశ్లేషించేందుకు. కానీ ఒంటరితనం ఓ విషాదం. ఎక్కడ ఉన్నా ఇమడలేని ఇరుకుదనం. ఇదేమీ కొత్త కాదు. మనిషి సంఘజీవిగా మారినప్పటి నుంచీ ఎవరో ఒకరిలో కనిపించే సమస్యే. అయితే అప్పటి కారణాలు సహజమైనవి. పరాయిదేశంలో తనది కాని జీవనశైలి మధ్య ఇమడలేకపోవడం, మనసుకు దగ్గరైన బంధాలు విచ్ఛిన్నం కావడం, ఆత్మీయులు చనిపోవడం, ప్రసూతి వైరాగ్యం లాంటి కుంగుబాట్లు, జన్యువులు… ఇందుకు ముఖ్య కారణంగా ఉండేవి. ఇప్పటి పరిస్థితి వేరు. ఇది ఆధునిక జీవితపు సైడ్‌ ఎఫెక్ట్‌. నానాటికీ పెరుగుతున్న మహమ్మారి. అందుకే గత ఏడాది అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి దీన్నొక మహమ్మారిగా వర్ణించారు. ‘పొగాకు, ఊబకాయం, డ్రగ్స్‌ లాంటి ఆరోగ్య సమస్యల విషయంలో మనం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామో… ఒంటరితనం గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒంటరితనాన్ని నివారించిన రోజే మరింత ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం’ అని ఆయన కుండ బద్దలు కొట్టేశారు.

ఒంటరితనం అనుభవించని మనిషంటూ ఉండడు. ఏదో ఒక సందర్భంలో… బాధలోనో, అనారోగ్యంతోనో, ఎడబాటు వల్లో, వైఫల్యం కారణంగానో ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. అయితే ఆ భావన నిరంతరాయంగా ఉంటూ మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే మాత్రం దీర్ఘకాలిక సమస్యగానే భావించాలి. ఈ ఒంటరితనంతో కుటుంబం, దేశం, ఆ మాటకు వస్తే సమాజం ఎంతలా అతలాకుతలం అవుతాయో తెలుసుకునేందుకు ఒకసారి అలా జపాన్‌కు వెళ్లి రావాలి. చైనా నుంచి కొవిడ్‌ మొదలైతే, దాని పొరుగు దేశమైన జపాన్‌ నుంచి ఒంటరితనం అనే మహమ్మారి ప్రచారంలోకి వస్తున్నది. దానికి అక్కడి ప్రజలు పెట్టుకున్న పేరు హికికొమోరి! నిజానికి జపాన్‌ అంటే లోకం మొత్తానికీ ఓ అబ్బురం. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ జోన్‌లో ఉండటం వల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఆ అలజడుల వల్ల అక్కడి అగ్నిపర్వతాలు కూడా నిప్పులు కక్కుతుంటాయి. వీటన్నింటినీ దాటుకుని ఎదుగుతున్న దేశం మీద పిడుగులా అణుబాంబు పడింది. పంచభూతాల స్థానంలో మంటలే రాజ్యమేలిన ఆ పరిస్థితిని కూడా జపాన్‌ అధిగమించింది. కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో నిలదొక్కుకుంది. ఎటు చూసినా, ఎవరికైనా తనే ఆదర్శంగా తోచింది. మేనేజ్‌మెంట్‌ పాఠాలు నేర్చుకోవాలంటే ఆ దేశమే, జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి అంటే అక్కడి జీవనశైలే! 2000 సంవత్సరం నాటికి పరిస్థితి మారిపోయింది. లోకాన్ని మెప్పించడంలోనూ, కెరీర్‌ పరుగులు తీయడంలోనూ జపనీయులు ఎక్కడో తమను తాము మర్చిపోయేంతగా దారితప్పారని అర్థమైంది. అది హికికొమోరి ద్వారా బయటపడటం మొదలైంది.

ప్రముఖ సైకాలజిస్ట్‌ అయిన సైటో తమాకి, తన పుస్తకంలో మొదటిసారి ఈ పదాన్ని వాడారు. హికికొమోరి అంటే జపనీస్‌ భాషలో ‘సమాజం నుంచి ఒంటరిగా ఉండటం, తనలోకి తాను పారిపోవడం’. ఒక ఆరు నెలలపాటు పనికో, చదువుకో వెళ్లకుండా గదిలోనే ఉండిపోయేవారు ఈ హికికొమోరి బాధితులు అని సాక్షాత్తు అక్కడి ఆరోగ్య శాఖే ప్రకటించింది. అంతేకాదు! ఈ సమస్యలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా అక్కడి సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా సమాజం నుంచి దూరం జరగడం, షాపింగ్‌ లాంటి రోజువారీ పనులకు కూడా బయటికి వెళ్లకపోవడం, మిత్రులకు దూరం కావడం, మాట్లాడటం తగ్గించేయడం, నలుగురూ కలుసుకునే సందర్భాలను తప్పించుకోవడం, నిరంతరం దిగాలుగా కనిపించడం… హికికొమోరిలో కచ్చితంగా కనిపించే లక్షణాలు. ఇది ఉన్న పిల్లలు బడికి వెళ్లరు, పెద్దలైతే ఉద్యోగానికి రాజీనామా కూడా చేసేయవచ్చు. ఈ సమస్య జపాన్‌లో ఎంత తీవ్రంగా ఉందీ అంటే స్వయంగా ప్రభుత్వమే హికికొమోరి ఒక సామాజిక సమస్య అని ఒప్పుకొని లెక్కలు కట్టింది. ఆ గణాంకాల ప్రకారమే జపాన్‌లో దాదాపు 15 లక్షల మంది హికికొమోరి గుప్పిట చిక్కుకున్నారు. ఇక అనధికారికంగా ఆ సంఖ్య ఇంకెంత ఉంటుందో!

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z