Business

డెల్ నుండి 6000 మంది ఔట్

డెల్ నుండి 6000 మంది ఔట్

గ్లోబల్ టెక్ జెయింట్ డెల్ (Dell) రెండేండ్లలో మలి దఫా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 6,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఏడాది క్రితం సుమారు 1.26 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, గత నెల రెండో తేదీ నాటికి దాదాపు 1.20 లక్షల మందికి తగ్గిపోయింది. ఏయే విభాగాలను తొలగిస్తారన్న సంగతి బయటపెట్టలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించుకుని పొదుపు చర్యల్లో భాగంగా 2023లో 6,650 మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపింది. రోజురోజుకు పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా డెల్ యాజమాన్యం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ఒక ఆంగ్ల దిన పత్రిక ఓ వార్తాకథనం ప్రచురించింది.

మార్కెట్లో సవాళ్ల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకుని కంపెనీ పనితీరును క్రమబద్ధీకరించుకోవడంలో భాగంగా డెల్ ఉద్యోగులను తొలగిస్తున్నది. రెండేండ్లుగా పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిపోయిందని డెల్ యాజమాన్యం పేర్కొంది. గతేడాది నాలుగో త్రైమాసికంలో రెవెన్యూ 11 శాతం తగ్గడమే దీనికి కారణం అని భావిస్తున్నది.

ఉద్యోగుల తొలగింపుతోపాటు వివిధ రకాల పొదుపు వ్యూహాలను అమలు చేస్తున్నది. ఉద్యోగుల పనితీరు పునర్వ్యవస్థీకరణ, పరిమితంగా కొత్త ఉద్యోగుల నియామకం చేపట్టాలని డెల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. పర్సనల్ కంప్యూటర్ డివిజన్ లో సవాళ్లు ఎదురవుతున్నా, ఏడాది పొడవునా క్లయింట్ సొల్యూసన్స్ గ్రూప్ ద్వారా రెవెన్యూ గ్రోత్ ఆశావాహంగా ఉంటుందని భావిస్తున్నది. గత మే నెలలో ఉద్యోగులు ‘హైబ్రీడ్’, ‘రిమోట్’ మోడ్ లో పని చేయాలన్న విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల రిమోట్’ మోడ్ కింద పని చేసే ఉద్యోగులకు కెరీర్ లో ముందుకు వెళ్లే అవకాశాలు తక్కువ. రిమోట్ వర్కర్లకు ప్రమోషన్లు వర్తించబోవని డెల్ తెలిపింది. హైబ్రీడ్’ మోడ్‌లో పని చేసే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. రిమోట్ వర్కర్లు ఆఫీస్ బయట ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించొచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z