Business

టీవీల ధరలు పెరుగుతాయి-BusinessNews-Mar 30 2024

టీవీల ధరలు పెరుగుతాయి-BusinessNews-Mar 30 2024

* చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. వ్యక్తి వాయిస్‌ను క్లోన్‌ చేయగలిగే వాయిస్‌ ఇంజిన్‌ సాంకేతికతను ఆవిష్కరించినట్లు చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రకటించారు. ఈ టూల్‌ ద్వారా కేవలం 15 సెకన్ల రికార్డింగ్‌తోనే వ్యక్తి వాయిస్‌ని పునః సృష్టించొచ్చని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతానికి పౌరులకు దీన్ని అందుబాటులోకి తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. వాయిస్‌ క్లోన్‌ అంటే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మనిషి వాయిస్‌ను రీక్రియేట్‌ చేయడం. ప్రస్తుతానికి దీన్ని పరీక్షించనున్నామని ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు. ‘‘వ్యక్తుల ప్రసంగాలను క్లోన్ చేసి మళ్లీ సృష్టించడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రమాదాలకు మరింత ఆస్కారం ఉంటుంది. అందుకే కొత్త సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోం’’ అని శామ్‌ ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు.

* దేశంలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఇంటి అద్దె భత్యం (HRA) కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం పాన్‌ కార్డులను అనధికారికంగా ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అద్దె ఇంట్లో నివసించనప్పటికీ.. కేవలం పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్‌ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. ఇలా సుమారు 8-10 వేల కేసులను గుర్తించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. హెచ్‌ఆర్‌ఏ అనేది వేతనంలో భాగంగా ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్నవారు రెంటల్‌ అగ్రిమెంట్‌ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. కొందరు వ్యక్తులు తాము అద్దెకు లేకపోయినా అద్దె చెల్లిస్తున్నట్లు పేర్కొనడం వెలుగుచూసింది. ఇందుకోసం వారు ఇతరుల పాన్‌ కార్డులను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే పాన్‌ కార్డుదారుడికి తన పేరుమీద అద్దె అదాయం వస్తున్నట్లు కూడా తెలీదన్నమాట. కోటి రూపాయల రెంట్‌ రిసిప్ట్‌ను ఓ వ్యక్తి పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. సదరు పాన్‌ కార్డుదారుడిని ఆరా తీస్తే తనకూ ఎలాంటి అద్దె రావడం లేదని పేర్కొనడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.

* యూఎస్‌ఎస్‌డీ (USSD) కాల్‌ ఫార్వర్డింగ్‌లను ఏప్రిల్‌ 15 నుంచి డీయాక్టివేట్‌ చేయాలని టెలికాం ఆపరేటర్లకు టెలికాం విభాగం (DoT) సూచించింది. ఆ సేవలను రీయాక్టివేట్‌ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతులకు మళ్లాలని పేర్కొంది. ఐఎమ్‌ఈఐ (IMEI) నంబర్లు, మొబైల్‌ ఫోన్‌ బ్యాలెన్స్‌లను తనిఖీ చేసుకోవడానికి ఉపయోగించేదే ఈ అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా ఆధారిత కాల్‌ ఫార్వర్డింగ్‌ సదుపాయం. *401# సేవలుగా వీటిని పిలుస్తుంటారు. అయితే వీటిని కొందరు అసమంజస కార్యకలాపాలకు వినియోగిస్తుండడంతో డాట్‌ ఈ చర్యలకు దిగింది. యూఎస్‌ఎస్‌డీ ఆధారిత కాల్‌ ఫార్వర్డింగ్‌ సేవలున్న ప్రస్తుత వినియోగదారులు అందరూ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆ సేవలను రీయాక్టివేట్‌ చేసుకోవాలని డాట్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మొబైల్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు టెలికాం విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

* స్మార్ట్‌ టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్‌ ధరలు పెరగడంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉన్నదని కౌంటర్‌పాయింట్స్‌ ఐవోటీ సర్వీస్‌ వెల్లడించింది. అయినప్పటికీ దేశీయంగా ప్రీమియం మాడళ్లకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో స్మార్ట్‌ టీవీ దిగుమతులు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంది. కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయని, ముఖ్యంగా అతిపెద్ద స్క్రీన్‌ టీవీలకు అప్‌గ్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి. ప్రీమియం మాడళ్లను సైతం ఆన్‌లైన్‌లో చూసి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారులు ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌పై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌తో సరాసరి వీటి విక్రయ ధర కూడా అధికం కాబోతున్నది. దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో గతేడాది టీవీల దిగుమతులు 16 శాతం మేర తగ్గిన విషయం తెలిసిందే. దేశీయంగా వినియోగిస్తున్న టీవీల్లో స్మార్ట్‌ టీవీల వాటా 93 శాతంగా ఉన్నది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని తన నివేదికలో వెల్లడించింది. 43 అంగుళాల కలిగిన క్యూలెడ్‌ టీవీలను విక్రయిస్తున్న టీసీఎల్‌, ఏసర్‌, కొడక్‌, థామ్సన్‌, ఇతర బ్రాండ్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

* ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) కార్యాలయాలు ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ఎల్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆదివారం బ్యాంకులు పనిచేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఆర్‌డీఏఐ సూచన మేరకు పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తమ కార్యాలయాలను శని, ఆదివారాల్లో తెరుస్తామని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z