* భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు నిన్న తిరస్కరించింది.
* ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists), పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
* కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఏడాది వయసున్న కుమారుడికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బొమ్మకల్‌కు చెందిన శ్రీజకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో రెండు రోజుల క్రితమే శ్రీజ తన కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఇక ఇవాళ తన కుమారుడికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు కూడా చనిపోయాడు. కుమార్తె శ్రీజ ఆత్మహత్య వార్త తెలిసి ఆమె తల్లి జయప్రద కూడా విషం తాగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీజ కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
* మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ డిపో సమీపంలోని చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పొగ కాల్చడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z