Business

ఆ వివరాలు ఇవ్వడం కుదరదన్న SBI-BusinessNews-Apr 02 2024

ఆ వివరాలు ఇవ్వడం కుదరదన్న SBI-BusinessNews-Apr 02 2024

* రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీతోపాటు ఆర్థిక రంగంలో అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ‘మెకెన్సీ (McKinsey)’ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్రిటన్ లోని తన ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన మెకెన్సీ ఇచ్చిన ఆఫర్ అందరినీ ఆలోచింపజేస్తున్నది. అలా ఉద్వాసనకు గురైన వారికి తొమ్మిది నెలల వేతన పరిహార ప్యాకేజీ, తదుపరి ఉద్యోగాలకు కెరీర్ ట్రైనింగ్ అందిస్తామని ప్రకటించింది.

* దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74,022.30 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 73,743.77 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్‌.. 74,099.78 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 110.64 పాయింట్ల నష్టంతో 73,903.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8.70 పాయింట్లు పతనమై.. 22,453.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.

* ప్రముఖ పుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు (Zomato).. ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసు అందింది. సర్వీస్‌ ట్యాక్స్‌, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని ఆ శాఖ ఆదేశించింది. దీనిపై అప్పీల్‌కు వెళతామని జొమాటో పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. విదేశీ అనుబంధ సంస్థలు, దేశం వెలుపల ఉన్న శాఖల్లో 2014 అక్టోబర్‌ నుంచి 2017 జూన్‌ మధ్య జరిగిన విక్రయాలపై సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని దిల్లీ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఏప్రిల్‌ 1న డిమాండ్‌ నోటీసు పంపించినట్లు కంపెనీ తెలిపింది. ఇదివరకే పంపించిన షోకాజ్‌ నోటీసుపై తాము ఆధారాలతో సహా వివరణ ఇచ్చామని, ఈ ఉత్తర్వులు ఇచ్చే ముందు సంబంధిత అధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో పేర్కొంది.

* ఎన్నికల బాండ్ల (Electoral bonds) పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో.. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన వివరాలను ఎన్నికల సంఘం (EC) బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాండ్ల విక్రయాలకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) వెల్లడించాలంటూ సహ చట్టం కింద దరఖాస్తు దాఖలైంది. అయితే, ఈ వివరాలు బయటపెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నిరాకరించింది. ఎన్నికల బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్‌ కోసం తమ అధీకృత బ్రాంచీలకు ఎస్‌బీఐ జారీ చేసిన ఎస్‌వోపీ వివరాలను చెప్పాలంటూ హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్‌ సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై ఎస్‌బీఐ సమాధానమిచ్చింది. ‘‘అది మా అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుంది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నాయి’’ అని స్టేట్ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

* రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గతేడాది మే 19న ఆర్‌బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z