Kids

“దైవ కణం” కనుగొన్న పీటర్‌ హిగ్స్‌ మృతి

“దైవ కణం”  కనుగొన్న పీటర్‌ హిగ్స్‌ మృతి

‘హిగ్స్‌ బోసన్‌’ కణాన్ని కనుగొన్న బ్రిటన్‌కు చెందిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత (Nobel Award Winner) పీటర్‌ హిగ్స్‌ (Peter Higgs) (94) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఈడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ‘దైవ కణం’ (God Particle) లేదా ‘హిగ్స్‌ బోసన్‌’ (Higgs Boson) సిద్ధాంతంతో పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆయన.. భౌతికశాస్త్రంలో ఎన్నో చిక్కుముడులు విప్పారు. 1964లోనే ‘హిగ్స్‌ బోసన్‌’ కణం ఉనికిని ఆయన తన సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు.

2012లో యూరోపియన్‌ ఆర్గనేజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రిసెర్చ్‌లోని లార్జ్‌ హ్యాడ్రన్‌ కొల్లాయిడర్‌లో ‘దైవ కణం’పై ప్రయోగాలు చేశారు. వాటి ఫలితాల ఆధారంగా దాదాపు అరశతాబ్దానికి ముందే ఆయన రూపొందించిన సిద్ధాంతాన్ని, హిగ్స్‌ బోసన్‌ కణం ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. తన సిద్ధాంతానికి బెల్జియన్‌ భౌతికశాస్త్రవేత్త ఫ్రాంకోయిస్‌తో కలిసి ఆయన 2013లో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. ‘‘పీటర్‌ హిగ్స్‌ తన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారు. అంతకుముందురోజు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొప్ప టీచర్‌గా, మార్గనిర్దేశకునిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన ఒక స్ఫూర్తివంతంగా నిలుస్తాడు’’ అని స్కాటిష్‌ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్‌ దాదాపు ఐదు దశాబ్దాలు ఈ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆ వర్సిటీతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z