* దేశంలో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభమైంది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికరలాభం రూ.11,392 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.45,908 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఎక్స్ఛేంజీకిచ్చిన సమాచారంలో టీసీఎస్ తెలిపింది. మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.61,237 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. గతేడాది నమోదైన రూ.59,162 కోట్లతో పోలిస్తే 3.5 శాతం వృద్ధి నమోదైంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1.50 శాతం పెరిగి 26 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పూర్తి సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.28 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు 0.45 శాతం లాభంతో 4000.30 వద్ద ముగిసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో అంచనాలు మించి ద్రవ్యోల్బణం నమోదు కావడడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందన్న ఆశలపై ద్రవ్యోల్బణ గణాంకాలు నీల్లు చల్లాయి. దీనికితోడు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాలకు మొగ్గు చూపడం వంటి కారణాలతో మన సూచీలు పతనమయ్యాయి. పెరిగిన చమురు ధరలూ మదుపరులను కలవరపెడుతున్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,500 స్థాయికి చేరింది. ఉదయం 74,889.64 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీ మరింత పతనమైంది. ఇంట్రాడేలో 74,189.31 కనిష్ఠానికి చేరింది. చివరికి 793.25 పాయింట్ల నష్టంతో 74,244.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 234.40 పాయింట్ల నష్టంతో 22,519 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, టీసీఎస్, నెస్లే ఇండియా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 90.73 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,414 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా.. సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
* స్కామ్.. స్కామ్.. స్కామ్.. రోజూ దీనికి సంబంధించి ఏదోఒక వార్త బయటకు వస్తూనే ఉంది. ప్రస్తుతం ట్రెండ్‌లో నడుస్తున్న అంశాన్ని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయి. దీనిపై అవగాహన లేకపోయినా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయనే ఆశతో చాలామంది వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అలాంటివారిపై కేటుగాళ్లు కన్నేశారు. దీనికోసం రూపొందించిన యాడ్‌లో ఏకంగా బ్రోకరేజ్ సంస్థకు చెందిన వ్యక్తి ఫొటోనే ఉపయోగించారు ‘‘ఏప్రిల్‌లో మంచి లాభాలు తెచ్చిపెట్టే స్టాక్స్ గురించి చెబుతాం. దీనికోసం మా వాట్సప్ గ్రూప్‌లో చేరండి. రోజూ 1-3 స్టాక్‌లు ఎంపిక చేయాలని సూచిస్తాం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఫస్ట్ అప్లై చేసుకున్న 1000 మందికి మాత్రమే ఉచితం’’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనపై ఏకంగా స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Zerodha’s CEO Nikhil Kamath) ఫొటో కనిపిస్తుంది. ఆయనే స్వయంగా స్టాక్‌లు సజ్జెస్ట్ చేస్తారంటూ ఆ యాడ్‌ను తయారుచేశారు. ఈ పోస్ట్ నెట్టింట నిఖిల్ కంటపడింది. దీంతో ఆయన ‘‘ఎక్స్’’ వేదికగా స్పందించారు.
* ఐఫోన్ (iPhone) రిపేర్ ప్రక్రియను ఎట్టకేలకు యాపిల్ సులభతరం చేయనుంది. పాత ఫోన్లలోని విడి భాగాలతో మరమ్మతులు చేసుకునేందుకు త్వరలో అనుమతించనున్నట్లు గురువారం ప్రకటించింది. వీటి వాడకం వల్ల రిపేర్ చేసిన ఫోన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, ఈ మార్పును కొన్ని మోడళ్లకు మాత్రమే అనుమతించనుంది. అవేంటనేది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఐఫోన్‌ను (iPhone) రిపేర్ చేయాలంటే పార్ట్స్ పెయిరింగ్ అనే ప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది. అంటే డివైజ్ సీరియల్ నంబరుతో యాపిల్ విక్రయించిన కొత్త విడిభాగానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య సరిపోలాలి. అలాకాకుండా వాడిన పాత ఫోన్ నుంచి తీసుకున్న లేదా మార్కెట్‌లో దొరికిన పార్ట్‌ను అమర్చితే తరచూ నోటిఫికేషన్లు వస్తాయి. కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన పరికరాన్ని ధ్రువీకరించలేకపోతున్నామని చెబుతుంది. ఫేస్‌ఐడీ, టచ్‌ఐడీ వంటి సెన్సార్లయితే అసలు పని చేయవు.
* ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. మరో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేయబోతోంది. తన ఎస్1 ఎక్స్ సిరీస్‌లో అప్‌డేట్ చేసిన విద్యుత్ స్కూటర్ రాబోతోంది. గతంలో తీసుకొచ్చిన ఎస్1 ప్రో, ఎయిర్ మోడళ్లలో ఉన్న స్పెషల్ ఫీచర్లు అన్నీ కలిపి కొత్త స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఫిజికల్ కీ కూడా ఉండనుందని ఆయన ట్వీట్ చేశారు. ఏప్రిల్ 15న ఈ స్కూటర్ లాంచ్ కానుంది.
* పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ మీద షాకులిస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 12) పీక్‌కు చేరాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు 10 గ్రాములకు ఈరోజు ఏకంగా రూ.1090 మేర పెరిగాయి. ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1090 చొప్పున పెరిగి రూ.73,310 వద్దకు ఎగిసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z