DailyDose

రామేశ్వరం పేలుళ్ల నిందితుడు అరెస్ట్-CrimeNews-Apr 12 2024

రామేశ్వరం పేలుళ్ల నిందితుడు అరెస్ట్-CrimeNews-Apr 12 2024

* మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి ఒక వ్యవస్థ మీద పోరాటం చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. మీడియాను అడ్డుపెట్టుకుని చట్టాలను ఉల్లంఘించి నేరపూరితంగా అక్రమ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీపై రెండు దశాబ్దాలుగా పోరాటం చేయడమంటే మాటలా? పైగా ప్రభుత్వంలో, వేర్వేరు వ్యవస్థల్లో ఉన్న వాళ్లను అండగా మార్చుకున్న రామోజీని ఎదిరించింది ఉండవల్లి సామాన్యుడు కాదు అసామాన్యుడు. కాగా, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను. నేను అడిగింది 45-ఎస్‌ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావు పాల్పడ్డ ఆర్థిక అక్రమాల వ్యవహారంలో నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్‌ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్‌ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారని ఉండవల్లి అన్నారు. డిపాజిటర్ల సమస్యలను thedepositers@gmail.com కు ఈ మెయిల్‌ చేయవచ్చు. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఉండవల్లి అన్నారు.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడు, ఉగ్రవాది షాజిబ్‌ హుస్సన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. వివరాల ప్రకారం.. రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు షాజిబ్‌ను ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్‌ను ఎట్టకేలకు ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఇక, పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్‌ఐఏ రంగంలోకి దిగింది.

* నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్‌ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. స్మశానాలను సైతం వదలకుండా అర్ధరాత్రి వేళ ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తోలిస్తే శవం బయటపడిందని భవన యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పద్మనాభంపేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తోలించారు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని ఇసుకతో నింపేందుకు ఇసుక తీస్తుండగా అందులో పురుషుడి శవం బయటపడింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేశారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బయటపడ్డ మృతదేహాన్ని రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. మొండెం మాత్రమే ఉండటంతో జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది? ఇసుక ఎక్కడ నుంచి తరలించారు? ఏం జరిగింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z