DailyDose

రంగారెడ్డి: కోటి రూపాయిల లాంబోర్గినికి నిప్పు-CrimeNews-Apr 14 2024

రంగారెడ్డి: కోటి రూపాయిల లాంబోర్గినికి నిప్పు-CrimeNews-Apr 14 2024

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్‌నగర్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్‌ ప్రకారం సీఎం జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్‌ టీమ్‌, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

* జగిత్యాల జిల్లా కేంద్రంలోని వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థలపై పట్టణ సీఐ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కాసారపు రాజయ్య వద్ద రూ.56.35 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.4 లక్షలు, లవంగ రాజేందర్‌ వద్ద రూ.70 వేలు, రూ.1.58 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రమేశ్‌ వద్ద 28 ప్రామిసరీ నోట్లు, రెండు ఖాళీ చెక్కులు, అరవింద్‌ వద్ద 29 ఖాళీ చెక్కులు, రూ.2.50 లక్షల విలువైన మార్టిగేషన్‌ పేపర్లు, కడెం వెంకవ్వ వద్ద రూ.21.43 లక్షల విలువైన 56 ప్రామిసరీ నోట్లు, రూ.85 వేలు పట్టుకున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైలు నరేశ్‌కుమార్‌, మన్మధరావు, ఏఎస్సై వేణురావు, సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మోతె, టీఆర్‌నగర్‌ గ్రామాల్లోని నలుగురు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై సదాకర్‌ తెలిపారు. టీఆర్‌నగర్‌కు చెందిన పెద్ద సారయ్య ఇంట్లో రూ.1.19 లక్షలు, 129 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

* కొనుగోలు ముసుగులో స్పోర్ట్స్‌ కారుకు నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్‌ పీఎస్‌ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్‌ అనే వ్యాపారి తన లంబోర్ఘిని కారు (డిఎల్‌ 09 సివి 3636) అమ్మాలని నిర్ణయించుకొని పరిచయస్తుడైన అయాన్‌కు చెప్పాడు. దీంతో కస్టమర్‌ ఉంటే చూడాలంటూ అయాన్‌ తన స్నేహితుడైన మొఘల్‌పురాకు చెందిన అమన్‌ హైదర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్‌ తెలిపాడు.

శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్‌హౌస్‌ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్‌ చెప్పడంతో, అయాన్‌ కారు తీసుకొచ్చి జల్‌పల్లి వద్ద అమన్‌కు ఇచ్చాడు. జల్‌పల్లి నుంచి అమన్‌ తన స్నేహితుడు హందాన్‌తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్‌ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు వైపు మళ్లి కారును ఆపారు. అనంతరం అహ్మద్‌, అతనితో పాటు మరికొంత మంది హోండా సిటీ, వ్యాగనార్‌ కార్లు, బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. నీరజ్‌ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్‌, అతని వెంట వచ్చిన వారు బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒక్కసారిగా లంబోర్గిని కారుపై పోసి నిప్పంటించారు. ఫైరింజన్‌ ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డి, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి, ఎస్సై మధుసూదన్‌ ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అమన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉండవచ్చని తెలిపారు.

* ఛత్తీస్‌గఢ్‌లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌)పై రాయ్‌పుర్‌ సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితుల జాబితాలో 12వ స్థానంలో మేఘా సంస్థను చేర్చింది. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్‌ స్టీల్‌ ఆధ్వర్యంలోని మెకాన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరిపైనా కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా నాగర్నార్‌లోని ఎన్‌ఎండీసీ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఎస్‌పీ) ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల జారీ విషయంలో అధికారులకు మేఘా లంచమిచ్చిందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్‌ఎండీసీ విశ్రాంత ఈడీ ప్రశాంత్‌ దశ్‌, జీఎం(ఫైనాన్స్‌) రాజశేఖర్‌, మేనేజర్‌(ఫైనాన్స్‌) సోమ్‌నాథ్‌ ఘోష్‌, ఎన్‌ఐఎస్‌పీ డైరెక్టర్‌(ప్రొడక్షన్‌) దిలీప్‌కుమార్‌ మొహంతి, డీజీఎం ప్రదీప్‌కుమార్‌ భూయాన్‌, డిప్యూటీ మేనేజర్‌ నరేశ్‌బాబు, సీనియర్‌ మేనేజర్‌ సువ్రో బెనర్జీ, సీజీఎం కృష్ణమోహన్‌, మెకాన్‌ సంస్థ విశ్రాంత ఏజీఎం(కాంట్రాక్ట్స్‌) సంజీవ్‌ సహాయ్‌, విశ్రాంత డీజీఎం(కాంట్రాక్ట్స్‌) ఇలవరుసు, మేఘా జీఎం సుభాష్‌చంద్ర సంగ్రాస్‌, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌పై ఈ కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z